నకిలీ పత్రంతో మట్టి తరలింపు
అధికారులను బురిడీ కొట్టించిన అక్రమార్కులు
జహీరాబాద్, మే 22 : మట్టిని తరలించే అక్రమార్కులు నీటిపారుదల, రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించారు. గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తరలించి సోమ్ము చేసుకున్నారు. హద్నూర్ పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలింపుపై మంగళవారం దినపత్రికలో వచ్చిన కథనంతో అధికారులు విచారణ చేపడితే అసలు విషయం బయటకు వచ్చింది. మంగళవారం సాయంత్రం చెరువు పరిసరాలను సంబంధిత శాఖ సిబ్బంది పరిశీలించారు. మట్టిని తరలించిన సదరు వ్యక్తి తన వద్ద ఉన్న పర్మిషన్ పత్రాన్ని నీటిపారుదల సిబ్బందికి వాట్సప్ ద్వారా పంపించారు. దాన్ని వెంటనే సంబంధిత ఉన్నతాధికారి పంపించడంతో అసలు అది పర్మిషన్ పత్రమే కాదన్నారు.
దీంతో అక్రమార్కులు పర్మిషన్ ఉందంటూ నమ్మబలికి చెరువులో నుంచి భారీగా మట్టిని తరలించి సోమ్ము చేసుకున్నట్టు అసలు విషయం బయట పడింది. చెరువులో నుంచి మట్టిని తరలించాలంటే ముందుగా నీటిపారుదలశాఖ ఈఈకి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో అయితే రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అదేమి లేకుండా ఉన్నతాధికారి సంతకంతో కూడిన చిట్టీని దగ్గర పెట్టుకుని పర్మిషన్ ఉందంటూ హద్నూర్ చెరువులో నుంచి భారీగా మట్టిని తరలించారు.
అయితే నియోజకవర్గంలోని ఆయా మండలల్లోని చెరువులు, ప్రభుత్వ భూముల్లో నుంచి అక్రమార్కులు మట్టిని తరలించిన సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. అధికారులకు చెప్పకుండా మట్టి తరలింపు జరిగాయా.. లేక అక్రమార్కులు, అధికారులు ప్రజల్ని బురిడీ కొట్టించారా అన్నది.. అక్రమార్కులపై తీసుకునే చర్యలను బట్టి ఉంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.






