20 August, 2026 | 12:01 PM

పోగొట్టుకున్న ఐదు తులాల బంగారం స్వచ్ఛందంగా అప్పగింత

20-08-2026 11:24 AM

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 20 (విజయక్రాంతి): పోగొట్టుకున్న ఐదు తులాల బంగారం గొలుసును గుర్తించి యజమానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన భూమా బాలాగౌడ్ బుధవారం ఆంధ్ర బ్యాంక్ నుండి ఐదు తులాల బంగారు గొలుసులు తీసుకొని ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో బంగారు గొలుసు ఉన్న కవర్ పొరపాటున పోగొట్టుకున్నాడు.ఈ విషయంపై బాధితుడు భూమా బాలాగౌడ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.సీసీ కెమెరాల ఆధారంగా ఎనుగండ్ల పోచవ్వ (చినుర్) వద్ద పడిపోయిన బంగారం గొలుసు కవర్ను తీసుకెళ్లినట్లు గుర్తించారు.

అనంతరం పోలీసులు పోచవ్వను  సంప్రదించి విచారించగా ఆమె కవర్లో ఉన్న వస్తువును పరిశీలించకుండా నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పింది.పోలీసులు బంగారం గొలుసును స్వాధీనం చేసుకొని వివరాలను నిర్ధారించిన అనంతరం బాధితుడు భూమాబాలాగౌడుకు తిరిగి అప్పగించారు.బంగారు గొలుసును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన పోచవ్వను బాధితుడు బాలాగౌడ్ అభినందించి ఆమెకు పారితోషికముగా కొంత నగదు అందజేశారు.సిసి కెమెరాల సహాయంతో తక్షణమే స్పందించి పోగొట్టుకున్న బంగారు ఆభరణాన్ని గుర్తించి యజమానికి అప్పజెప్పడంతో కీలక పాత్ర  పోషించిన లింగంపేట ఎస్సై దీపక్,నాగిరెడ్డిపేట్ మండల పోలీస్ సిబ్బంది దక్షిణామూర్తి,నరేష్ శ్రీనివాస్,రాజశేఖర్ తదితర అధికారులు మరియు సిబ్బందిని ఫిర్యాదుదారుడు భూమాబాలాగౌడ్ ప్రత్యక్షంగా అభినందనలు తెలియజేసినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.