- రైతులకు ఉచితంగా అందించాలి
- వ్యవసాయానికి విరివిగా వాడాలి
- పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డి పల్లె
- మిగులు విద్యుత్తుతో రైతుకు ఆదాయం
- బీడు, అటవీ భూముల్లో సోలార్ ప్లాంట్లు
- ఏటా ౪౦ వేల మెగావాట్ల కరెంటు
- బిజినెస్ హబ్‌గా తెలంగాణ.. కరెంటే కీలకం
- విద్యుత్తుపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులు సౌర విద్యుత్తును అధికంగా వినియోగించేలా అధికారులు ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అందు కోసం అన్నదాతలకు సౌర విద్యుత్తు మోటర్లను ఉచితంగా అందించే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తన స్వగ్రామం కొండారెడ్డి పల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతులు వ్యవసాయానికి సౌర విద్యుత్ మోటర్లు వినియోగించే పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
పడావు భూముల్లో కరెంటు ఉత్పత్తి
డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ పంపుసెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్‌పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఎల్పీజీకి బదులు సోలార్ సిలిండర్లు
ఇండ్లలో వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్‌కు బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. దీనిపై మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి, వారిని సోలార్ సిలిండర్ వ్యాపారం వైపు ప్రోత్సహించాలని ఆదేశించారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని సూచించారు.
4౦ వేల మెగావాట్లు అవసరం
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం బిజినెస్ హబ్‌గా మారబోతోందని.. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్తును అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం సూచిం చారు. ఐటీ, పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని.. భవిష్యత్తు అవసరాల మేరకు సరిపోయినంత విద్యుత్తు కోసం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలిన విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏటా 40 వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలని, ఓవర్‌లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కను క్కోవాలని కోరారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని స్పష్టంచేశారు. వినియోగదారులకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రొనాల్డ్ రోస్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
వేగంగా విద్యుత్ పునరుద్ధరణ
వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సచి వాలయంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యు త్ పునరుద్ధరణ సమయంలో అధికారులు, సిబ్బంది ఏ సమస్య వచ్చినా సీఎండీల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.