రైతును రాజును చేయడమే లక్ష్యం
హైదరాబాద్: రవీంద్రభారతిలో ఘనంగా శ్రీపరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు(Sri Paraabhava Nama Ugadi Vedukalu) నిర్వహించారు. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం.. ఉగాది ప్రధానంగా రైతుల పండగ అన్నారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకుకెళ్తున్నామని సూచించారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయని చెప్పారు. రైతులు(Farmers ) ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే రైతులకు రూ. 18 వేల కోట్లు ఇచ్చామన్న సీఎం రేవంత్ ఈ నెల 22 నుంచి మళ్లీ రైతుభరోసా(Ryhtu Bharosa) కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేస్తామని పేర్కొన్నారు.
రైతులు తమ భూములను సొంతం చేసుకోవడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ధరణి పోర్టల్‌ను(Dharani Portal) తొలగించి, భూ యాజమాన్య సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతిని(Bhu Bharati) ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సరసన తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించారు. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖ, టీపీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.




