13-11-2025 12:00:00 AM
- సమస్యకు కారణమైన టిఫిన్ సెంటర్ కు ఫెనాల్టీ
- ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి
ఇబ్రహీంపట్నం నవంబర్ 12: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో “దుర్గంధం వెదజల్లుతున్న.. అధికారుల పట్టింపేది” అంటూ విజయక్రాంతి డిజిటల్ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి, సాగర్ రహదారికి ఆనుకుని ఉన్న యూనియన్ బ్యాంక్ ముందు గత 20 రోజుల నుంచి అండర్ డ్రైనేజీ పొంగిపొర్లుతోంది.
దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోయారు. మురుగునీరు పొంగుతున్న సమీపంలోనే ప్రధాన రహదారిలో బస్టాప్ కూడా ఉంది. కళాశాలలకు వచ్చే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. దీనిపై మంగళవారం విజయక్రాంతి డిజిటల్ లో వార్తా ప్రచురితం కావడంతో స్పందించిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు అదే రోజు మున్సిపల్ సిబ్బందితో చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా బుధవారం తెల్లవారుజామునే మున్సిపల్ సిబ్బందిచే డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి, సమస్యను పరిష్కరించారు.
అనంతరం ఈ సమస్యకు కారణమైన పక్కనే ఉన్న “బాబాయ్ టిఫిన్ సెంటర్” ను సందర్శించి వారు వాడే ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్ధాలను టిఫిన్ సెంటర్ నుండి డ్రైనేజీ కి కలపబడిన పైప్ లైన్లోంచి నేరుగా వేస్తుండటంతోనే, డ్రైనేజీ పేరుకు పోతుందన్న విషయాన్ని గుర్తించి వారికి రూ. 2 వేలు పెనాల్టీ విధించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ధనార్జనే ధ్యేయంగా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే, పెనాల్టీనే కాదు, షాప్ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందనీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడంతో పలువురు విజయక్రాంతి పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
జప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి..
నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తే ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలో కొంతమేర పురోగతి సాధించవచ్చని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. పట్టణం నుంచి పల్లెల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచు లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కర్రీ పాయింట్, టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ప్లాస్టిక్ కవర్లు వాడుతూ వాటి లోనే వేడి వేడి తిను పదార్థాలను అందిస్తున్నారు. వాటి ద్వారా ఎంతో ప్రమాదమని వైద్యులు పలుమార్లు సూచిస్తున్నప్పటికి ఎవ రూ పట్టించుకోవడం లేదు. కావున దీనిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.