5 August, 2026 | 9:50 AM

ఓదెల మండలంలో ఘోరం.. తండ్రిని చంపిన కొడుకు

05-08-2026 09:13 AM
  1. ఓదెల మండలం మడక గ్రామంలో ఘోరం
  2. రక్తమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వృద్ధుడు
  3. తండ్రిని చంపాక కత్తితో చెయ్యి కోసుకుని నిందితుడి హల్‌చల్..
  4. అదుపులోకి తీసుకున్న పోలీసులు

పెద్దపల్లి, సుల్తానాబాద్/ఓదెల, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం (Odela Mandal)మడక గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కాలయముడై, మద్యానికి బానిసై కన్న తండ్రినే బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... మడక గ్రామానికి చెందిన వేపచెట్టు మాదయ్య (70) అనే వృద్ధుడు తన ఇంట్లో ఒక్కడే నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు బాబురావు గత కొంతకాలంగా విచ్చలవిడిగా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన బాబురావు, ఏదో విషయమై తండ్రి మాదయ్యతో తీవ్రంగా గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో విచక్షణ కోల్పోయిన బాబురావు, ఆవేశంతో సమీపంలో ఉన్న బండరాయిని తీసుకుని తండ్రి తలపై తీవ్రంగా బాదాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో మాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తండ్రి మృతి చెందిన అనంతరం నిందితుడు బాబురావు కత్తితో తన చేయి కోసుకొని స్థానికంగా హల్‌చల్ చేశాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన నిందితుడు బాబురావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాదయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.