10-12-2025 12:23:36 AM
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
* సంగారెడ్డిలో ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు
సంగారెడ్డి, డిసెంబర్ 9(విజయక్రాంతి): మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అడుగుజాడల్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శాలతో యుపిఏ చైర్ పర్సన్ గా ఉపాధి హామీ పథకంతో దేశ ప్రజలకు పని కల్పించి ఆర్థికంగా ఎదిగేలా చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు. మంగళవారం సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సోనియా గాంధీ దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారన్నారు.
రాజీవ్ గాంధీ ఆలోచన విధానాలను అనుసరిస్తూ దేశ ప్రజలకు మేలు జరిగేలా యుపిఏ ప్రభుత్వ హయాంలో పాలన అందించిన గొప్ప నాయకురాలన్నారు. ఇచ్చిన హామీలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్, సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డులు లాంటి సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అమలు చేశారని చెప్పారు.
ఆర్టిసీని మూసివేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేసిందని, అలాంటిది ఉచిత బస్సు పథకంతో తిరిగి ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిఇచ్చారని గుర్తు చేశారు. యుపిఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ దేశంలోని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలని ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టారన్నారు.
ప్రతీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయని, వంద గజాల స్థలం ఉంటే రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, ప్రజలతో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.