10-12-2025 12:24:07 AM
కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ‘సంగం’ ప్రాజెక్టు
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్: వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ బ్రహ్మాకుమారీస్ ఆధ్యాత్మిక సేవా సంస్థతో కలిసి సంగం’ పేరుతో జాతీయ స్థాయి ప్రాజెక్టును ప్రారంభించింది. కుటుంబంలో, సమాజంలో వృద్ధుల్ని గౌరవించే భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయటం, వయోధికులు మానసిక-శారీరక ఆరోగ్యంతో ఆనందంగా ఉండటం కోసం ఏజ్ విత్ ప్రైడ్&లివ్ విత్ డిగ్నిటీ(గౌరవంగా వృద్ధాప్యం&హుందాగా జీవనం) నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు.
మంగళవారం బీబీ నగర్ సమీపంలోని బ్రహ్మాకుమారీస్-సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌లో ’సంగం’ ప్రాజెక్టును వందకు పైగా వృద్ధాశ్రమాల నిర్వాహకుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ స్థాయి వరకు స్ధానిక ప్రభుత్వాలు,బ్రహ్మాకుమారీస్ సేవా కేంద్రాలు కలసి సంయుక్తంగా చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు,మానసిక ప్రశాంతత-శారీరక ఆరోగ్య శిక్షణ శిబిరాల గురించి వివరించారు.
సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్లు బి.కె.రాజ కుమారీ,బి.కె.సునీత ఆధ్వర్యంలో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రతినిధులను సత్కరించారు. బ్రహ్మాకుమారీస్ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం నుంచి వచ్చిన సమజాసేవ నిపుణులు వృద్ధాశ్రమాల నిర్వాహకులకు ధ్యాన యోగ-వ్యక్తిత్త్వ నైపుణ్యాల శిక్షణ అందించారు. బ్రహ్మాకుమారీస్ సోషల్ వింగ్ వైస్ చైర్మన్ బి.కె.ప్రేమ్ కుమార్, బి.కె.వీరేందర్, బి.కె.గిరీశ్, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్.జి.నాగేశ్వర రావు, వివిధ రాష్ట్ర,జిల్లా స్థాయిల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు.