అనుమతిలేని ఆహార తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసులు దాడి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఎలాంటి అనుమతులు లేకుండా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న యూనిట్ పై ఎస్ఓటి పోలీసులు దాడి చేసిన సంఘటన పోచారం ఐటి కాలిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరిగూడ లో ఉన్న ఒక మిక్సర్ తయారీ యూనిట్‌పై బుధవారం విశ్వనీయ సమాచారం మేరకు ఎస్ఓటి ఉప్పల్ జోన్ బృందం దాడి చేసింది. ఈ యూనిట్‌లో గడువు ముగిసిన ముడి పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించి, అపరిశుభ్రమైన పరిస్థితులలో సరైన అనుమతి లేకుండా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది ఆహార కల్తీకి సంబంధించిన అనుమానాన్ని రేకెత్తిస్తోందని తెలిపారు.
ఈ మిక్సర్ తయారీ యూనిట్ ను కాలా జోసెఫ్ (50) ఇంటి నెం. 17-59/385, ప్రత్యూష కాలనీ, చౌదరిగూడ లో నిర్వహిస్తున్నాడు. ఆ యూనిట్ లో సింథటిక్ ఫుడ్ కలర్ బ్లూ స్టార్ గ్రీన్ 1 సీసా, సింథటిక్ ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో 100 గ్రాములు, సింథటిక్ ఫుడ్ కలర్ బ్లూ స్టార్ 50 గ్రాములు, 999 సింథటిక్ ఫుడ్ కలర్ (ఎరుపు, పసుపు) 25 సీసాలు, తయారీ మిశ్రమం 1 కేజీ 6 ప్యాకెట్లు, ఆకుపచ్చ రంగు బటానీ 1 కేజీ 10 ప్యాకెట్లు, గడువు ముగిసిన స్టార్ జైన్ డ్రై మసాలా 6 ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని పోచారం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.






