దక్షిణాది అయోధ్య.. భద్రాచలం!
గోదావరి తీరాన కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రమే ‘భద్రాచలం’. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమికి ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణలో భద్రాచలం రాములవారి ఆలయంలో సీతారామకల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం రావడానికి కారణం అక్కడి స్థల పురాణ మహిమ అని చెప్పవచ్చు. వాల్మీకి రామాయణంలో భీజ ప్రాయంగా భద్రాచల స్థల పురాణాన్ని వేదవ్యాస మహర్షి బ్రహ్మపురాణంలో వివరించారు. వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరమే ‘పర్ణశాల’ గా ప్రాచుర్యం పొందింది. కొద్దిరోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారు. శ్రీరాముని వనవాస సమయంలోనే భద్రుడనే భక్తుడు జన్మిస్తాడు.
భద్రుని తపః ప్రభావం వల్లనే భద్రాద్రి క్షేత్రం వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. భద్రుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆయన సాక్షాత్కారం కోసం కఠోరమైన తపస్సు ఆచరిస్తే, శ్రీరాముని రూపంలో విష్ణుమూర్తి భద్రుడికి దర్శనమిస్తాడు. తదనంతరం భద్రుడు గోదావరి నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంగా మారిపోతాడు. ఆ స్థలమే భద్రాచలం. తన హృదయ స్థానంలో రాముడు కొలువయిన ఆ పర్వతానికి భద్రాద్రి అనీ, ఆ స్థలానికి భద్రాచలం అని పేరు వచ్చింది.
రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్‌దాస్ శిష్యుడైన శ్రీ రామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం.. భద్రాచల శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు!
ఈ విషయం నవాబ్ తానీషాకి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా.. ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి.
చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము ఆరు లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తి చేశాడట.! ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు.. తానీషాకు శ్రీరాముడు స్వయం గా చెల్లించిన బంగారు ఆభరణాలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు. రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలు ఇక్కడ జరిగాయని కొన్ని నిదర్శనాలుగా చెప్పుకొనే చారిత్రక ఆధారాలు చూడొచ్చు.
ఎలా వెళ్ళాలి..
హైదరాబాద్ నుంచి సుమారు 310 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రం ఖమ్మం నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మం నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సౌకర్యం ఉంటుంది. గోదావరిలో నీటిప్రవాహం బాగుంటే.. పడవలో.. పాపికొండల ప్రకృతి అందాలను చూడొచ్చు.






