17 July, 2026 | 9:23 PM

సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలి

17-07-2026 09:23 PM

సమాచార వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలి

ఆర్థిక నేరాల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీని మరింత పటిష్టం చేయాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలి

వార్షిక తనిఖీ లలో భాగంగా ఉట్నూర్ ఎఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఉట్నూర్,(విజయక్రాంతి): జిల్లాలో ప్రజలకు సమర్థవంతంగా  పోలీస్ శాఖ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఉట్నూర్ ఎఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే జిల్లా ఎస్పీకి పూల మొక్క అందించి సాదరంగా స్వాగతం పలికారు. సిబ్బంది చే గౌరవ వందనాన్ని  స్వీకరించారు. ఏఎస్పీ కార్యాలయంలో  వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, నేరాల వివరాలను, రికార్డులను జిల్లా ఎస్పీ పరిశీలించారు.

కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఒక మొక్కను నాటి పచ్చదనంపై ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రతిరోజు కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి సంబంధిత అధికారుల ద్వారా సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించినప్పుడే పోలీసు శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, కేసుల విచారణను నాణ్యతతో పూర్తి చేసి నిర్దేశిత గడువులోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.

హెచ్ఆర్ఎంఎస్ ఎప్పటికప్పుడు నవీకరణ, సిడిఓ, బ్లూ కోర్ట్, పిటిషన్ పిటిషన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, బీట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, పట్టణ గ్రామ స్థాయిలో సమాచార సేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను చైతన్యపరుస్తూ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అదనపు పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యాలయంలో 5S విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ రికార్డుల నిర్వహణను క్రమబద్ధీకరించాలని, ఎటువంటి పెండెన్సీలు లేకుండా పనితీరును మెరుగుపరచాలని సూచించారు. సిబ్బంది విధుల నిర్వహణను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సీఐలు ఎం ప్రసాద్, సిహెచ్ రమేష్, కె నరేష్, ఎస్సైలు ఈ సాయన్న, ఇమ్రాన్, ఎల్ శ్రీకాంత్, విక్రమ్, గుంపుల విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.