పోలీస్ జాగిలం రాజా మృతి.. నివాళులర్పించిన ఎస్పీ
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో పోలీస్ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ సంతతికి చెందిన రాజా అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు , పోలీస్ జాగిలం హ్యాండ్లర్ మల్లేశంతో కలసి రాజా పై పుష్పగుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజా సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... జాగిలం రాజా గత 14 సంవత్సరాల నుండి జిల్లాలో విఐపి, వివిఐపిలు సందర్శించినప్పుడు (ఆర్ఓపి) స్నిపర్, బాంబులు, మందు పాత్రలు, గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించేదని కొనియాడారు. 2010 సంవత్సరంలో రాజా తన హ్యాండ్లర్ మల్లేశం తో పాటుగా ఎనిమిది నెలల పాటు ఐఐటీఏ, మొయినాబాద్ లో బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో గత 14 సంవత్సరాలుగా సేవలందించిందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, రాజా హ్యాండ్లర్ మల్లేశం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






