జాగ్రత్తగా మాట్లాడండి..
బీజేపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ వార్నింగ్
మత విద్వేషాలు సృష్టించేలా ప్రచారం చేయొద్దని హితవు
న్యూఢిల్లీ, మే 22: బీజేపీ, కాంగ్రెస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఆ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారంలో జాగ్రత్తగా మాట్లాడాలని, మతం, కులం, భాష, వర్గాల మధ్య విబేధాలు సృష్టించే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఈసీ లేఖ రాసింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించింది. ప్రచారంలో హుందాతనం ప్రదర్శించాలని, చేసిన తప్పులను సరిదిద్దుకునేలా చూడాలని వివరించింది. ‘దేశంలోని నాణ్యమైన ఎన్నికల విధానాన్ని రెండు పార్టీలు చెడగొట్టొద్దు’ అని పేర్కొంది.
బీజేపీ, కాంగ్రెస్‌పై ఆగ్రహం..
సమాజంలో విబేధాలు సృష్టించేలా బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో ఈసీ అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న సంపద పంపిణీ, సనాతన ధర్మం, రాహుల్ గాంధీపై శక్తి, ముస్లిం లీగ్ మ్యానిఫెస్టో అని సంబోధించడం వంటి అంశాలను ఈసీ ఆక్షేపించింది. ఇక బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానించడాన్ని కూడా తప్పు బట్టింది. తప్పుదోవ పట్టించే, ఆధారరహిత వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికింది. ఆర్మీపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌కు గతంలో ఈసీ ఇచ్చిన నోటీసులపై రెండు పార్టీలు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని ఈసీ పేర్కొంది.






