టీనేజర్ డ్రైవింగ్ లో ఇద్దరు మృతి.. 25 ఏళ్ల వరకు నో లైసెన్స్
మహారాష్ట్ర: పుణెలో మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణమైన 17 ఏళ్ల బాలుడి విషయంలో మహారాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాలుడికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అతడు నడిపిన ఖరీదైన పోర్షే కారుకు శాశ్వత రిజిస్ట్రేషన్ లేకపోవడంతో.. ఏ ఆర్టీవో కార్యాలయంలోనూ ఏడాది పాటు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధించింది. మార్చి నుంచి కారు పర్మినెంట్ ఫీజు రూ.1,758 పెండింగ్‌లో ఉందని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వివేక్ భీమాన్వర్ తెలిపారు. ఈ కేసులో టీనేజర్ తండ్రి విశాల్ అగర్వాల్ పుణెలో పేరున్న రియల్టర్. బాలుడికి కారు ఇచ్చినందుకు తండ్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే తనను అరెస్టు చేస్తారని ఊహించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులను ఏమార్చేందుకు మంగళవారం ఒక కారులో ముంబై బయలుదేరి.. తనకు చెందిన మరో కారును డ్రైవర్‌తో గోవాకు పంపించాడు. ముంబై రోడ్డుపై ప్రయాణిస్తూ మధ్యలోనే కారు దిగిన నిందితుడు, తన స్నేహితుడి కారులో ఛత్రపతి శంభాజీనగర్ బయలుదేరాడు. రియల్టర్ తన స్నేహితుడి కారులో వెళ్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు జిపిఎస్ ద్వారా కారును ట్రాక్ చేసి అతడు శంభాజీనగర్ చేరుకున్నాక అరెస్టు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచగా, మే 24 వరకు పోలీసు కస్టడీ విధించింది.






