హైదరాబాద్‌లో.. 2,250 కోట్ల పనులతో ప్రత్యేక కార్యాచరణ
- ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి
- మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
- 60వేలకోట్ల ఆదాయం సమకూరుస్తున్నా తెలంగాణపై కేంద్రం చిన్నచూపే
- ప్రతిపక్ష సభ్యులు అసత్య ప్రచారాలు మానుకోవాలి: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి) : 2026 బడ్జెట్‌లో హైదరాబాద్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకుగానూ రూ. 2,250 కోట్లు ఖర్చు పెట్టే కార్యాచరణను రూపొందించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రోడ్లు, ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్ రోడ్లకు సంబంధించిన ప్రభుత్వం వేల కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రోజులోనే ఖర్చు చేయలేమని, అభివృద్ధి పనుల్లో ప్రణాళికాబద్ధంగా వెళ్లాలని స్పష్టంచేశారు.
ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుసాగుతుందని తెలిపారు. జంట నగరాల అభివృద్ధిలో రాజీపడేది లేదన్నారు. సెలబ్రిటీలే కాదు.. సామాన్యు లు కూడా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా భావించేలా ఈ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చి దిద్దుతామని శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం దేశ జీడీపీలో 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదన్నా రు.
రాష్ట్రం నుంచి పన్ను వసూళ్ల రూపంలో రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రం పొందుతున్నా, తెలంగాణపై వివ క్ష చూపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల పనులను వేటినీ రద్దు చేయలేదని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
కొన్ని చోట్ల స్వల్ప మార్పులు చేసినా పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కొన్ని పనులు మొదలై అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాధాన్యత క్రమంలో అన్నిటిని పూర్తి చేస్తామని వివరించారు.
కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద పనులు 15 రోజుల్లో ప్రారంభమవుతాయని, బాచుపల్లి హెచ్‌ఎండిఏ ఫ్లైఓవర్ పనులు మేనెల లోగా పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు వెల్లడించారు. తప్పకుండా పూర్తిచేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తామన్నారు. లింక్ రోడ్లలో మార్పు లు ఏమీ లేవని, కొన్ని పనులను రద్దు చేశామని చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు.
మేడ్చల్- సుచిత్ర ఎలివేటెడ్ రోడ్డు పనుల కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్లారని, దీనిపై సీఎం, రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి త్వరగా పూర్తిచేసేందుకు సహకరించాని కోరిన విషయాన్ని వెల్లడించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, అక్కడ కొత్త కాంట్రాక్టర్ వచ్చారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్యారడైజ్- శామీర్‌పేట, ప్యారడైజ్- సుచిత్ర ప్రాజెక్టు పనులు కూడా టెండర్ల ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు.
డిఫెన్సు భూముల బదలాయింపుకు సంబంధించిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి నాలుగుసార్లు కేంద్ర రక్షణ మంత్రిని కలిసి పరిష్కారానికి కృషి చేశారని, త్వరలో పనులు మొదలవుతాయన్నారు. హస్తినాపురం ఫ్లైఓవర్ ప్రతిపాదనపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని, తప్పకుండా చేపడతామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమంతో పాటు తూర్పు- పడమర ప్రాంతాలను కలిపేలా భారీ రహదారులను చేపట్టే ప్రణాళికలు సిద్ధమయ్యాయని శ్రీధర్‌బాబు వెల్లడించారు.
జంట నగరాలకు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరుగుతున్నాయని, దానికి తగినట్టు మంచినీటి సరఫరా, రహదారులను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భారీ ఆకాశ హర్మ్యాలకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అవన్నీ పూర్తయే దశకు చేరుకున్నాయని, అక్కడ ఆవాసాలు మొదలైతే పీక్ అవర్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.
దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు పనులను చేపడుతోందని వివరించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. గతంలో మూసీ నదీ మధ్యలో ఎస్టీపీని ఏర్పాటు చేయడానికి శాంక్షన్లు ఇచ్చారని, సాంకేతికంగా ఇది పెద్ద పొరపాటు అన్నారు. దానిని మరో చోట ఏర్పటు చేస్తున్నామని, శుద్ది చేసిన జలాలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు.
అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు విడుదల అవుతున్నాయని, అదే స్థాయిలో నిధులను తీసుకురావాలని బీజేపీ సభ్యులను కోరారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కేంద్రం తెలంగాణను చిన్నచూపు చూస్తోందని శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆ సమస్య ఎదుర్కొన్నానని, తనకు జరిగినట్టు ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నానని స్పష్టంచేశారు.
గత ప్రభుత్వం శంకుస్థాపన రాయికి కూడా పింక్ కలర్ వేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన బండలకు, టెంట్లకు కూడా పింక్ కలర్ వేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని, సమయం చూసుకుని సీఎం రేవంత్‌రెడ్డితో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేసుకుంటూ ఉండాలని, తాము పనులు చేసుకుంటూ వెళ్తామని ఎద్దేవా చేశారు.
చిత్తశుద్ధి ఉంటే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని హితవు పలికారు. ఇటీవల 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడైనా మల్లారెడ్డి అసత్యాలు చెప్పబోరని ఆశించామని, కానీ వారు అలాగే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన బయట నిజాలు మాట్లాడుతారని, సభలోకి వచ్చిన తర్వాత ముందు వారి ప్రభావంతో సైడ్ ట్రాక్ అవుతుంటారని అన్నారు.
పదేళ్లు రోడ్లు, డ్రెయిన్లు, నీళ్లు లేవని మల్లారెడ్డి చెప్పకనే చెప్పారని అన్నారు. జవహర్‌నగర్‌లో చెత్త వ్యర్థాల ఆధారంగా 48 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని, కానీ 20 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉండేనని చెప్పారు. వారి ఆవేదనను అర్థం చేసుకుని జవహర్‌నగర్ డంప్‌యార్డు సమస్య పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు. సీఎం మరో ౩ చోట్ల డంపిం గ్ యార్డులను అభివృద్ధి చేయాలన్నారు.




