హేమాచల క్షేత్ర ఆలయ ఈఓ బదిలీ
మంగపేట, మార్చి 24 (విజయక్రాంతి): రెండవ యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో అంతర్గత కుమ్ములాట, వివాదాస్పదంగా మారుతున్న అధికారి తీరు, సిబ్బంది మధ్య లోపించిన సమన్వయం, ఆలయ ప్రతిష్టపై భక్తుల ఆందోళనల నేపథ్యాన్ని వివరిస్తూ ఇటీవల ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురించిన ప్రత్యేక వార్తా కథనానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారిని బదిలీ చేసి, మేడారం కార్యనిర్వాహణాధికారికి మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారిగా ఇన్ చార్జి భాధ్యతలు అప్పగించారు. ఇటీవల విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కధనం అనంతరం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏం జరుగుతోంది, ఇన్నేళ్ళు ఆలయంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా ఎవరు వ్యవహరిస్తున్నారు, అంతర్గత కుమ్ములాటకు ఆజ్యం పోసింది ఎవరు, ఓ వర్గానికి కొమ్ము కాస్తుంది ఎవరు అనే విషయాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తోంది.
నిభందనల ప్రకారం శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి గ్రేడ్ 1 స్థాయి అధికారిని ఈవో గా నియమించాల్సి ఉంటుందని, గ్రేడ్ 1 స్థాయి అధికారికి సుదీర్ఘ అనుభవం ఉండడంతోపాటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన అన్ని నియమ నిభందనలు, దేవాలయానికి చెందిన సిబ్బందితో ఎలా వ్యవహరించాలనే అంశాలపై అవగాహన, పూర్తి స్థాయి పట్టు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నకార్యనిర్వాహణాధికారి గ్రేడ్ 3 స్థాయి అధికారి కావడం, ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలతో పాటు మే 1వ తేది నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపధ్యం తదితర కారణాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న కార్యనిర్వాహణాధికారిని బదిలీ చేసినట్లు భావిస్తున్నారు.




