ఫామ్ పాండ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి
-ఎంపీడీవో భరత్ కుమార్
తాడ్వాయి: రైతులకు ఫాంపాండ్ల ప్రాధాన్యతను వివరించి, వాటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో భరత్ కుమార్ సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనుల రూపకల్పనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేయాలని తెలిపారు.
గ్రామాల్లో ఫాంపాండ్లు, పర్కొలేషన్ ట్యాంకులు, సోక్‌పిట్లు, పాత బావుల్లో పూడికతీత, బోర్‌వెల్ రీఛార్జ్ పనులు, కొత్త బావుల గుర్తింపు, ప్లాంటేషన్ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు. ముఖ్యంగా ఫాంపాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో రైతులకు ఉపయోగం కలుగుతుందని, అర్హత ఉన్న రైతులను గుర్తించి వాటి నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల ఎంపికలో గ్రామస్థుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, గ్రామ అవసరాలు మరియు వ్యవసాయానికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల రూపకల్పనను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సదస్సులో సర్పంచులు సంకు పోచయ్య, భాస్కర్ రెడ్డి, వినోద, ఏపీవో తిరుపతి, టీఏలు కృష్ణ గౌడ్, రాజు, కైలాస్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.