31 July, 2026 | 1:51 AM

జిల్లాలో మాతా,శిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి

31-07-2026 12:13 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, జులై 30 (విజయక్రాంతి): జిల్లాలో మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు. గురు వారం ఐడిఓసి కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా నమోదైన మాతా, శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించి, మరణాలకు గల కారణాల నివేదికలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నమోదైన రెండు మాతా మరణాలు, మూడు శిశు మరణాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

మాతా,శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని, గర్భిణీ స్త్రీల పర్యవేక్షణ, సకాలంలో వైద్య సేవలు, ప్రసూతి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.హై రిస్క్ కేసులను ముందుగానే గుర్తించి, అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా తగిన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు.

ఆశా, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో గ్రామ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణ చర్యలను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.ప్రతి మరణాన్ని లోతుగా విశ్లేషించి, కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మాతా, శిశు మరణాలను తగ్గించడం అత్యంత ప్రాధాన్య అంశమని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్, ఉప వైద్యాధికారి డా. శ్రీదేవి, ప్రోగ్రాం అధికారి డా. నాగరాణి, మెడికల్ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.