17 July, 2026 | 9:24 PM

స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు

17-07-2026 09:24 PM

భద్రాద్రి.కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, విద్యార్థుల భద్రత , రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ బస్సులు, భారీ వాహనాలను తనిఖీ చేసి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, ఇతర సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

కేఎల్ఆర్ కాలేజ్ పాల్వంచ బస్సు డ్రైవర్ ఎస్ భాస్కర్, ఎస్ఆర్డిజి జూనియర్ కాలేజ్ కొత్తగూడెం బస్ డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ఈ తనిఖీల్లో పట్టు పడడం జరిగింది. వారిపై సెక్షన్ 185 యమ్.వి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ తనికెల్లో మొత్తం 185 కేసులు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే  మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 యమ్.వి యాక్ట్ ప్రకారం నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.