23 June, 2026 | 5:06 PM

పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి

23-06-2026 03:52 PM

అధికలోడు వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

 షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ జూన్ 23(విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం పూర్తిస్థాయిలో పాఠశాల బస్సుల తనిఖీలు నిర్వహించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీఏ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాల బస్సులను తప్పనిసరిగా లైసెన్స్ కలిగి, అనుభవం ఉన్న డ్రైవర్లతోనే నడిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల బస్సులకు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించి, వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పాఠశాల వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా అధికలోడుతో రాకపోకలు సాగిస్తున్న టిప్పర్లు, మట్టి రవాణా వాహనాలు, ఇతర భారీ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్నకు సూచించారు. అధికలోడు కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రహదారులు త్వరగా పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుని రహదారుల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతను కాపాడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.