23 June, 2026 | 6:01 PM

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక

23-06-2026 05:03 PM

ఎన్నిక పట్ల పలువురు హర్షం 

మోతె,(విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 20, 21, 22 తేదీలలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలో మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మట్టి పెల్లి సైదులు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మట్టి పెల్లి సైదులు విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. 2001లో ఎస్‌ఎఫ్‌ఐ మోతే మండల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థి ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2003లో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ సహాయ కార్యదర్శిగా, జిల్లా నాయకుడిగా పనిచేశారు. 2004లో యువజన సంఘం డివిజన్ కార్యదర్శిగా, జిల్లా సహాయ కార్యదర్శిగా, 2007లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సేవలందించారు.

2009లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట డివిజన్ మహాసభలో డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జిల్లా కార్యదర్శిగా ఎన్నికై, గత 12 సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. గతంలో మిర్యాలగూడలో జరిగిన రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మూడు సంవత్సరాలు పనిచేసిన ఆయన, ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్ర నాలుగో మహాసభలో రెండోసారి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడం విశేషం.

ఈ సందర్భంగా మట్టి పెల్లి సైదులు మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరింత బలమైన పోరాటాలు నిర్మిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేసిన పలువురు 

మట్టి పెల్లి సైదులు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడం పట్ల ప్రజా సంఘాల నాయకులు, రైతు-వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.