23 June, 2026 | 4:59 PM

ముంపు బాధితులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ యువ నాయకులు

23-06-2026 03:46 PM

బీఆర్ఎస్ యువ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ 

సహాయక చర్యలను పర్యవేక్షించారు

అమీన్ పూర్: రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా బీరంగూడ డివిజన్ పరిధిలోని నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ వద్ద భారీగా వర్షపు నీరు చేరి అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా మునిగిపోయింది. సెల్లార్‌లో పార్క్ చేసిన 20కి పైగా ద్విచక్ర వాహనాలు, పలువురు నివాసితుల కార్లు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని వేగంగా తొలగించే చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఐలాపూర్ మాణిక్ యాదవ్  ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో అవసరం లేకపోతే సెల్లార్ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లు, నీటిలో మునిగిన ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండాలని, పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆడనివ్వకూడదని కోరారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, కాలువలు, నీరు నిలిచిన రోడ్ల వద్ద అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల భద్రతే అందరికీ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.