సుల్తానాబాద్‌లో ప్రత్యేక వైద్య శిబిరం
సుల్తానాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ 12వ వార్డు పరిధిలో డెంగ్యూ కేసు గుర్తించడంతో నివారణకు గాను శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి పలువురు నుంచి రక్త నమూనాలు సేకరించారు. డాక్టర్ నిస్సీ క్రిస్టినా ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ సింధుజ డెంగ్యూ వ్యాధి సోకిన వ్యక్తి నివాసంతో పాటు పరిసర గృహాలలో పైరేత్రం స్ప్రే చేయించి ప్రజలకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలు పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రమేష్ , వార్డు కౌన్సిలర్ అమిరిశెట్టి శ్రావణి రాకేష్ , హెల్త్ అసిస్టెంట్ రాజేశ్వర రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ టి.రమేష్ , మాజీ వార్డు సభ్యులు అమిరిశెట్టి తిరుపతి, ఏఎన్ఎంరమాదేవి,ఆశావర్కర్లు సుజాత, శ్రీమతి, స్వరూప, కోమల, సుగుణ తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు..






