17 March, 2026 | 5:53 AM

స్పెషల్ ఆఫీసర్లు విరివిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలి

17-03-2026 01:55 AM
  1. ఏప్రిల్ 1 నాటికి ఈ ఆఫీసులుగా ప్రభుత్వ కార్యాలయాలు 

ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ

అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం

నిజామాబాద్, మార్చి 16(విజయ క్రాంతి) : మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవి, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించే సమయంలో వారి ఆరోగ్యం, సామాజిక సమస్యలు, మానసికపరమైన ఒత్తిడి తదితర అంశాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా విద్యార్థినుల నుండి వివరాలు సేకరించాలని ఆదేశించారు.

బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని, విద్యార్థినులకు ఇంకనూ ఏమైనా సహాయ సహకారాలు, మద్దతు అవసరం ఉందా అన్నది గుర్తించాలన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీసులుగా మారాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిపాలనా పరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ విధానంలోనే జరగాలని ఆదేశించారు. ఆన్లైన్ విధానంపై అవసరమైతే ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఈడిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ కు సూచించారు. ఈ-ఆఫీసు ప్రక్రియకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని అన్నారు. 

వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తింపజేయాలి

వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తించేలా సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఐ.డీ.ఓ.సీలోని కాన్ఫరెన్స్ హాల్ లో వలస కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు,

తదితర చోట్ల పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు తగిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఎవరైనా బాల కార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ యాదగిరి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.