17 March, 2026 | 2:44 AM

6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఏదీ?

17-03-2026 01:58 AM

రాహుల్ బంధు కాదు.. రైతుబంధు కావాలి

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం

  1. ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  3. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీలకు చట్ట బద్ధత కల్పిస్తామని చెప్పినప్పటికీ రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంతవర కు వాటికి చట్టబద్ధత లేదని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో గతంలోనే.. మొదటిసారి గవర్నర్ ప్రసంగంలోనే దీని గురించి ప్రస్తావించారని, ఇది మూడో గవర్నర్ ప్రసంగం అని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ రైతన్నలకు వెన్నుపోటు పొడు స్తూ రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు పంపుతామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టిందని, కాంగ్రెస్ మోసాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. సోమవారం గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ హయాంలో వరి నాట్ల సమయంలోనే రైతు బంధు పడేదని, కాని ప్రస్తుతం పంటలు కోతకు వచ్చినా రైతు బంధు దిక్కులేదని, దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, సమాధానం కూడా లేదని విమర్శించారు. అందుకే ‘రాహుల్ బంధు కాదు, రైతు బంధు వేయండి’, ‘రాహుల్‌కు రూ. 1,000 కోట్లు.. రైతులకు వెన్నుపోట్లా’ అని బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తామని స్పష్టం చేశారు. అన్నివర్గాలకు హామీలిచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది ఆగ్రహం వ్యక్తం చేశారు.

బలహీన వర్గాలకు రూ. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారని, ఇప్పటికే రెండు బడ్జెట్ అయిపోయాయని, మూడో బడ్జెట్ కూడా వచ్చిం దన్నారు. ఈపాటికే రూ. 60 వేల కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాలని, కానీ ఇంతవరకు దానిపై కూడా స్పష్టత లేదన్నారు. దళితబంధు స్థానంలో రూ. 12 లక్షల ఇస్తా మన్నారని, ఇప్పటికీ అతిగతీ లేదని ఎద్దేవా చేశారు. రూ. 2,500 కోసం మహిళలు, రూ. 4 వేల పెన్షన్ కోసం వృద్ధులు, రైతు భరోసా కోసం రైతులు, నెలకు వెయ్యి ఇస్తారని రైతు కూలీలు, ఆటో అన్నలు, రూ. 10 వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల తల్లీదండ్రులు రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.

జాబ్ క్యాలెండర్ అన్నారని, కొత్త క్యాలెండర్ ఉంది కానీ ఉద్యోగాలైతే కనబడటం లేదని ఎద్దేవా చేశారు. మరి డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్నట్టు మీకు బ్రహ్మాండమైన వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ మీకు అప్పజెప్పితే మీరు ఆర్థిక అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే దానికి కారణం ఫైనాన్షియల్ మిస్ మేనేజ్‌మెంట్ అన్నారు.

తెలం గాణను ఏటీఎంగా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని పేదల మీద లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెలే ్యలు.. రైతులకు వెన్నుపోటు, రాహుల్‌కు రూ. వెయ్యి కోట్లు, రాహుల్ బంధు కాదు, రైతు బంధు కావాలి, పెన్షన్లు పెంచే మాట మరిచారు, పేదవాళ్ల నడ్డి విరిచారు, మహాలక్ష్మీ పథకం మాట మరిచారు, మహిళలను నట్టేట ముంచారు, ఆరు గ్యారెంటీలకు చట్ట బద్ధత కల్పించాలని నినాదాలు చేశారు.