25 May, 2026 | 1:46 AM

కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ

25-05-2026 12:41 AM
  1. వైభవంగా సాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు
  2. నాలుగో రోజు తరలివచ్చిన భక్తులు
  3. అద్వైతానంద భారతి స్వామీ విశేష పూజలు 

కాళేశ్వరం/మహబూబాబాద్, మే 24 (విజయక్రాంతి): సరస్వతి అంత్య పుష్కరాలను పురస్కరించుకొని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర మహా క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. సరస్వతి అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఆదివారం అద్వైతానంద భారతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు పుష్కర స్నానాలు ఆచరించారు.

వేద మంత్రోచ్ఛరణల మధ్య నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పార్వతి అమ్మవారికి, మహా సరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివ నామస్మరణలతో మారుమోగింది. ఆశీర్వచన మండపంలో ఆలయ తరఫున స్వామీజీ కి  పండ్లు, శేష వస్త్రాలు సమర్పించి సన్మానించారు.

అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించిన స్వామీజీకి సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎం.కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు, దేవదాయ శాఖ సలహాదారు గోవింద హరి, చైర్మన్ మోహన్ శర్మ, ఈఓ మహేష్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరం తరలివచ్చారు.

ఎండ తీవ్రతల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు. ప్రైవేటు వాహనాలను సైతం నేరుగా పుష్కర ఘాట్ల వరకు అనుమతించడంతో భక్తులకు ఇబ్బంది తొలగిపోయింది. వేలాదిమంది భక్తులు కాలేశ్వరం చేరుకొని నదిలో పుష్కర స్నానం ఆచరించి స్వామి దర్శనానికి క్యూ కట్టారు. దీనితో ఆదివారం కాలేశ్వరంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఎండ తీవ్రత నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు చల్లి భక్తులకు ఉపశమనం కలిగించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు క్యూలైన్లో భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేశారు.

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న భక్తులకు 108 అంబులెన్స్ సిబ్బంది విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు అనారోగ్యానికి గురైన 326 మంది భక్తులకు 108 అంబులెన్స్ సేవల ద్వారా ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందిస్తున్నట్టు  ప్రోగ్రామ్ మేనేజర్ పీ.ఎం. శివకుమార్, జిల్లా మేనేజర్  రాజు నాయక్ నాయక్ తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాలు చేసేందుకు  భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.

వేడి నుంచి ఉపశమనం

భక్తులకు వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు గ్రామంలోని ప్రధాన రహదా రులపై నిరంతరం నీటిని చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చర్య వల్ల రహదారులపై ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు, ధూళి తగ్గి భక్తులకు మంచి వాతావరణం కలుగుతోంది. ప్రత్యేకంగా పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో నీటి చల్లింపు కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే భక్తులు పుష్కర స్నానం ఆచరించడంతోపాటు స్వామి వారి దర్శనానికి వచ్చే రహదారుల్లో నీడ కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డాక్టర్ గోపాల్  వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  జిల్లా వైద్యాధికారులు  సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్యాంపులో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి,  చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.