నన్ను కొట్టి కోటి సంపాదించాడు
భజ్జీపై శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై, ఏప్రిల్ 25: ఐపీఎల్ చరిత్రలో చెంపదెబ్బ వివాదం మాయని మచ్చగా మిగిలిపోయింది. భారత మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య ఈ ఘటన జరిగింది. 2008 ఆరంభ సీజన్‌లో భారత హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు, శ్రీశాంత్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ పూర్తయి ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
భజ్జీ కోపంగా శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న శ్రీశాంత్ అలా చూస్తుండిపోయాడు. దీంతో భజ్జీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. దాదాపుగా ఎనిమిది మ్యాచ్‌లు అతడిపై నిషేధం విధించింది. ఈ ఘటనపై ఇటీవలే భజ్జీ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇప్పటికే శ్రీశాంత్‌కు 200 సార్లకు పైగా క్షమాపణలు చెప్పానని తెలిపాడు. అయితే, తాజాగా శ్రీశాంత్ భజ్జీపై సంచలన ఆరోపణలు చేశాడు.
ఈ ఘటనను అనుకూలంగా మలుచుకుని కోటి రూపాయలు సంపాదించాడంటూ ఆరోపించాడు. ఒకప్పుడు అన్నా అంటూ పిలిచాను గనుకే హర్భజన్‌ను క్షమించానని.. అయితే, అతడికి మాత్రం కృతజ్ఞత లేదంటూ మండిపడ్డాడు. భజ్జీ గురించి గతంలో తాను ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదనీ, ఇదే మొదటిసారిగా చెప్పాడు. ఇటీవలే ఆ ఘటనపై అతడు ఓ యాడ్ చేశాడని, దాని నుంచి దాదాపుగా కోటి దాకా సంపాదించాడన్నాడు. అంతేకాకుండా తనకు ఫోన్ చేసి ఆ యాడ్ గురించి ఇన్‌స్ట్టా స్టోరీలో పెట్టమని అడిగాడు.
అయితే తాను భజ్జీని క్షమిస్తాననీ, కానీ ఆ ఘటనను ఎన్నటికీ మర్చిపోనని సమాధానం ఇచ్చినట్టు తెలిపాడు. ఒకప్పుడు అతడిని అన్నా అని పిలిచేవాడిననీ, అతడు ఎప్పుడైతే ఆ యాడ్ చేశాడో అప్పటి నుంచి అస్సలు మాటలు లేవన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని బ్లాక్ చేశాననీ, ఇంత చేసినా అతడిపై తనకేమీ ఫిర్యాదులు లేవన్నాడు. అతడు, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలన్న శ్రీశాంత్ ఆ ఘటనను మాత్రం తాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాననీ ఉద్వేగానికి లోనయ్యాడు. శ్రీశాంత్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే, వీరిద్దరి మధ్య పాత వివాదం ఇంకా సమసిపోలేదని, పైగా కొత్త మలుపు తీసుకుందని తెలుస్తోంది.






