12 March, 2026 | 9:22 AM

తాగునీరు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి

12-03-2026 12:16 AM

కలెక్టర్ బాదావత్ సంతోష్

కల్వకుర్తి మార్చి 11:ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మెరుగుపడేలా గ్రామాలు, పట్టణాల్లో నివసించే ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ అందించే త్రాగునీరు సురక్షితంగా ఉండేలా పూర్తిస్థాయిలో శుద్ధి చేసి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్వకుర్తి పట్టణంలోని మిషన్ భగీరథ గ్రిడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 60 ఎమ్‌ఎల్డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. నీటి శుద్ధి ప్రక్రియ, శుద్ధి కేంద్రం పనితీరును పరిశీలించారు.

శుద్ధి ప్రక్రియలో పాటిస్తున్న విధానాలు, నీటి నిల్వ ట్యాంకులు, ఫిల్టరేషన్ వ్యవస్థ, ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షల సామర్థ్యం తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. నీటి నా ణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అందే త్రాగునీరు పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని విడాలన్నారు.

ప్రతిరోజూ నిర్వహించే నీటి పరీక్షల నివేదికలను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచాలని రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.కల్వకుర్తిలోని 60 ఎమ్‌ఎల్డీ సామర్థ్యం గల ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా ప్రతిరోజూ కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోని సుమారు 460 గ్రామాలకు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రోజుకు సుమారు 50 మిలియన్ లీటర్ల త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వ్యర్థాలతో మెప్మా సిబ్బంది తయారు చేసిన వివిధ కళా ఆకృతులను సందర్శించి వారిని అభినందించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, మిషన్ భగీరథ ఏఈ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.