నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
- దెబ్బతీసిన ఐటీ స్టాక్స్
- సెన్సెక్స్ 380 పాయింట్లు పతనం
- 24, 700 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశీయంగా వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. మరోవైపు ఐటీ, లోహ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను ఒత్తిడిలో పడేశాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 380 పాయింట్లకు పైగా కుంగింది. నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 24,700 మార్క్ దిగువకు పడిపోయింది.
క్రితం సెషన్ ముగింపు (82,133)తో పోలిస్తే ఈ ఉదయం 82,000 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. ఏ దశలోనూ కోలుకోని సూచీ చివరకు 384.55 పాయింట్లు దిగజారి 81.748.57 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 100.05 పాయింట్ల కుంగి 24,668.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పతనమైంది.
8 పైసలు క్షీణించి 84.88 వద్ద జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది.రంగాల వారీగా ఐటీ, లోహ, చమురు, గ్యాస్ రంగ సూచీలు 0.5-1.0 శాతం మేర కుంగాయి. అటు రియల్టీ సూచీ 3శాతం పెరిగింది. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభ పడగా.. టైటాన్ కంపెనీ, టీసీఎస్, హిందాల్కో ఇండస్టీస్, అదానీ పోర్ట్స్ భారత్ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.




