12 April, 2026 | 3:44 AM

ఈవీల ఛార్జింగ్ అవసరాలకు రూ.16 వేల కోట్లు

17-12-2024 12:00 AM

ఫిక్కీ నివేదిక అంచనా

న్యూఢిల్లీ: 2030 నాటికి పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ఛార్జింగ్ డిమాండ్‌ను తీర్చడానికి రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తన నివేదికలో తెలిపింది.భారత్ తన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ఛార్జింగ్ అవసరాలను తీర్చడానికి ఇప్పుడిప్పుడే సిద్ధమవుతోందని, 2030 నాటికి 30శాతం విద్యుదీకరణ సాధించడానికి రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవార తన నివేదికలో తెలిపింది.

అధిక ఈవీ డిమాండ్ ఉన్న టాప్ 40 నగరాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకమని ఫిక్కీ గుర్తించింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఈవీల వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, బస్సులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే పీఎంఈడ్రైవ్ పథకంతో సహా  ఈవీ వృద్ధిని పెంచడానికి భారత్ అనేక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది.

పీఎం ఈ-డ్రైవ్ పథకంభారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రజలకు డిస్కౌంట్లు, ఆర్థిక సహాయం వంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఫేమ్ 2 పథకం 2023-24లో ముగిసిన తర్వాత, పీఎం ఈ-డ్రైవ్ పథకం 2025-26 వరకు కొనసాగుతుంది. దీనిపై బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. అదనంగా, ఈవీలు.. సంప్రదాయ వాహనాలకు వర్తించే 28-50శాతంతో పోలిస్తే తక్కువ(5శాతం) జీఎస్టీ రేటు నుంచి ప్రయోజనం పొందొచ్చు. స్థానిక ఉత్పత్తిని ప్రొత్సహించడానికి, దిగుమతి చేసుకున్న ఈవీ భాగాలు, వాహనాలపైప్రభుత్వం అధిక పన్నులు విధిస్తోంది.