12-02-2025 01:56:32 AM
ప్యారానగర్ డంపింగ్ సెంటర్‌పై హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలం ప్యారానగర్‌లో డంపింగ్ సెంటర్‌కు చెందిన భూములపై ప్రభుత్వ సర్వే మూడు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఆ సర్వే నివేదిక వచ్చే వరకు పనులు ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
డంపింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోయే భూములపై అభ్యంతరాల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. సర్వే సమయంలో భూవివాదం వస్తే, ప్రభుత్వం వివా దాన్ని తేల్చలేదని, అది సివిల్ వివాదం అవుతుందని అభిప్రాయపడింది. ప్యారానగర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు 86.13 ఎకరాల ప్రైవేటు భూమిలో చదును చేసే పనులు జరుగుతున్నాయని, వాటిని నిలిపివేయాలంటూ రమాదేవి సహా ఆరుగురు వేసిన వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయ వాది తన వాదనలు వినిపిస్తూ.. పనుల విషయంలో గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ల చెందిన భూముల సాగవుతున్న పంటలతో పాటు అటవీ భూముల్లోని చెట్లు, పొదలను నరికివేస్తున్నారని వివరించారు.
డంపింగ్ యార్డు ఏర్పా టును స్థానికులతోపాటు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అథారిటీ సైతం వ్యతిరేకిస్తోందని తెలిపారు. అక్కడ డంపింగ్‌యార్డు ఏర్పాటైతే పక్షుల తాకిడి ఎక్కువ ఉంటుందని, తద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌లు, జెట్లు ప్రమాదాలకు గుర య్యే ఆస్కారం ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని వెల్లడించారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూము ల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదన్నారు. రెవెన్యూ శాఖ కేటాయించిన 15.2 ఎకరాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయని వివరించారు.
నర్సాపూర్ ప్రధాన రహదారి నుంచి వ్యర్థాల నిర్వహణ కేంద్రం వరకు అటవీ శాఖకు చెందిన ప్రాంతంలోనే సర్కార్ రోడ్డు నిర్మించిందన్నారు. ఆయా పనులకు అటవీ శాఖ నుంచి అనుమతులు సైతం ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పనులపై సర్వే మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుందన్నారు.
ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ.. సర్వే మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుందని అధికారులు చెప్తున్నందున, అప్పటివరకు పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించి.. పిటిషన్‌పై విచారణను మూసివేసింది.