భారత్- మైత్రి బలోపేతం
- ఇరుదేశాల మధ్య ౧౦ కీలక ఒప్పందాలు
- రక్షణ, సముద్ర జలాల భద్రత అంశంలో పరస్పర సహకారానికి ఒప్పందం
- డెయిరీ, ఫుడ్ టెక్నాలజీ రంగాల్లో సరికొత్త భాగస్వామ్యం
- 2030 నాటికి రూ.35 వేల కోట్ల వాణిజ్యమే లక్ష్యం
- న్యూజిల్యాండ్ ‘కియా ఓరా మోదీ’ ఎన్‌ఆర్‌ఐ సభలో భారత ప్రధాని మోదీ
వెల్లింగ్టన్, జూలై ౧౧: ‘భారత్ - న్యూజిల్యాండ్ బంధం మరింత బలోపేతమవుతున్నది. ఇరుదేశాల మధ్య ౧౦ కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక బంధాల్లో ఇదొక చారిత్రాత్మక మైలురాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య రూ.35 వేల కోట్ల వాణిజ్యమే లక్ష్యం’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇటీవల రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) తర్వాత, తాజాగా మోదీ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా శనివారం మోదీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు.
ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆహ్వానించారు. అక్కడి కళాకారులు మావోరీ సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తర్వాత ఇదే నగరంలో ‘కియా ఓరా మోదీ’ పేరిట నిర్వహించిన ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) సభలో మోదీ ప్రసంగించారు. నమ్మకం, స్నేహం అనే రెండు అంశాలపై భారత్ న్యూజిలాండ్ బంధం నిలబడిందని అభివర్ణించారు. న్యూజిల్యాండ్‌లో ‘వాకా’ అనే పదానికి పడవ అనే అర్థం ఉందని, ఆ పదానికి రెండు దేశాల మైత్రికి ప్రతీక అంటూ అభివర్ణించారు.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి అని ఉద్ఘాటించారు. యూపీఐ ద్వారా దేశంలో ప్రతి నెలా బిలియన్ల కొద్దీ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ ఎకానమీలో భారత్ కొత్త శిఖరాలను తాకుతున్నదని కొనియాడారు. ప్రపంచంలోనే మహిళలకు మొట్టమొదట ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్ అని కీర్తించారు.
ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలకు భారత్ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఖండాలా, ఎక్కడో బొంబాయి హిల్స్, కోరమండల్, కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రెసెంట్, అమృత్‌సర్ వీధి అని పేర్లుండటం విశేమని పేర్కొన్నారు. ఆ దేశ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ.. 21వ శతాబ్దాన్ని భారత్ శాసిస్తుందని కొనియాడారు. తర్వాత మోదీ ఆ దేశం నుంచి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ స్వీకరించారు.
ప్రధాన ఒప్పందాలివే..
అక్లాండ్‌లో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో భారత్ న్యూజిల్యాండ్ మధ్య రక్షణ, సముద్ర జలాల భద్రతా (మ్యారిటైమ్ సెక్యూరిటీ) రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం వార్షిక మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏర్పాటుకు అంగీకారం లభించింది. ఇండియన్ నేవీ, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ సపోర్ట్ ప్యాక్ట్ కుదిరింది.
భూజలాలపై అధ్యయనం (హైడ్రోగ్రఫీ), విపత్తు నిర్వహణ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
డెయిరీ, ఫుడ్ టెక్నాలజీ రంగాల్లో సరికొత్త భాగస్వామ్యానికి ఇరుదేశాలు శ్రీకారం చుట్టాయి. న్యూజిలాండ్ సాంకేతిక నైపుణ్యాలను భారత్, భారత్ పరిధిలోని మార్కెట్ అవకాశాలను న్యూజిల్యాండ్ అందిపుచ్చుకోనుంది. పాల ఉత్పత్తుల నాణ్యత పెంపునకు ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుంది.
సంస్కృతి, మ్యారిటైమ్ హెరిటేజ్, ఓషన్ రీసెర్చ్ రంగాల్లోనూ కీలక ఒప్పందాలు జరిగాయి. సముద్ర పరిశోధనల్లో రెండు దేశాలు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సాంస్కృతిక మార్పిడి ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయనేది లక్ష్యం.
క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధికి ఇరు దేశాల మధ్య ప్రత్యేక ఒప్పందం కుదిరింది.
మోదీ భావోద్వేగం
‘కియా ఓరా మోదీ’ పేరిట నిర్వహించిన ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) సభలో మోదీ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధానిగా తానున న్యూజిల్యాండ్ పర్యటనకు వచ్చానని, ఇది ౧౪౦ కోట్ల భారతీయుల తరఫున తనకు దక్కిన అరుదైన గౌరవమని భావోద్వేగానికి గురయ్యారు. తాను భారత రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని రోజుల్లో, ప్రజాప్రతినిధిగా లేని రోజుల్లో తాను న్యూజిల్యాండ్‌ను సందర్శించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు న్యూజిల్యాండ్‌వాసులు తనకు మఫ్లర్, టోపీ, చేతి గ్లౌజెస్ బహుమతిగా ఇచ్చారని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే దేశానికి చెందిన ఒక స్నేహితుడు తనకు మఫ్లర్ ఇచ్చాడని కంటతడి పెట్టారు.






