12 July, 2026 | 2:19 AM

కిలాడీ కమిటీ

12-07-2026 01:34 AM

కన్నెపల్లి పాటెత్తుకున్న బీఆర్‌ఎస్ గ్యాంగ్‌లో చేరిన ఈటల

  1. కేసీఆర్ నేతృత్వంలోని ఆ కమిటీలో హరీశ్, కేటీఆర్, ఈటల సభ్యులు 
  2. హరీశ్‌రావు సూచనలు.. ఈటల మాటలు 
  3. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ కుట్ర 
  4. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బరాజ్ వెన్నుపూస.. అదే విరిగింది 
  5. నీళ్లు ఎత్తిపోసినా మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందే.. 
  6. చర్లపల్లి జైలుకు పంపితే వారి అప్పులేంటో, తప్పులేంటో తెలిసేవి 
  7. ఆంధ్రోళ్ల మోచేయి నీళ్లు తాగే హరీశ్.. నీదీ ఒక బతుకేనా? 
  8. క్రషర్ల దగ్గరా కమీషన్లు వదలడం లేదు.. 
  9. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* మామ గుడిని మింగితే.. అల్లు డు గుడిలో లింగాన్ని మింగేరకం. ఆ గజదొంగల గుంపులో ఈటల రాజేందర్ చేరొద్దు. పాత కమీషన్లు రాబట్టుకునేందుకే హరీశ్ ఇప్పుడు నీటి పారుదల శాఖ కావాలని అడుగుతున్నాడు. బీఆర్‌ఎస్ ఎజెండాను కొందరు రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగులు సమర్థించడం కుట్ర.

 సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : ‘మేడిగడ్డ బ్యారేజ్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై అన్నీ అవాస్త వాలు చెప్పారు. గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తిపోయాలని బీఆర్‌ఎస్ నేతల వాదననే ఈటల రాజేందర్ ఎత్తుకున్నారు. ఆయన బీఆర్‌ఎస్ నేతలా మాట్లాడటం విడ్డూరం.

ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను కన్నెపల్లి వద్ద ఎత్తిపోయాలని బీఆర్‌ఎస్ నేతల వాదనలనే ఈటల కూడా తీసుకున్నారు. ఈటలపై తమకు ఒకప్పుడు గౌరవం ఉండేది. కానీ, ఇటీవలి వ్యాఖ్యలతో ఆ గౌరవాన్ని కోల్పోయారు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి మంత్రి తో లేదా ఎన్డీఎస్‌ఏ అధికారుల వద్ద వివరాలు తెలుసుకుని మాట్లాడితే ఆయన గౌరవం మరింత పెరిగేదని హితవు పలికారు.

మేడిగడ్డ వ్యవహారంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ‘కిలాడీ కమిటీ’ పనిచేస్తోందని, అందులో హరీశ్‌రావు, కేటీఆర్ సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు ఈటల కూడా చేరారని  సీఎం వ్యాఖ్యానించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బరా జ్ వెన్ను పూస అని, అదే దెబ్బతినడంతో మొత్తం ప్రాజెక్టు పనితీరుపై ప్రభావం పడిందని సీఎం పేర్కొన్నారు. ఎంత నీళ్లు ఎత్తిపోసినా చివరకు మళ్లీ మేడిగడ్డ బరాజ్‌కే రావాల్సి ఉంటుందని చెప్పా రు.

చర్లపల్లి జైలుకు పంపితే వారి అప్పులేమిటో, తప్పులేమిటో ప్రజలకు తెలిసేద న్నారు.  ఈటల రాజేందర్ ఈ కిలాడీ కమిటీని ఎన్డీఎస్‌ఏ వద్దకు తీసుకెళ్లి ఒప్పిస్తే మేము కూడా వస్తామని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణ బాధ్యతలను 2025 సెప్టెంబర్ 1న సీబీఐకి అప్పగిస్తూ జీవో నంబర్. 104 జారీ చేశామన్నారు.

ఇప్పటికీ విచారణ ఎందుకు వేగంగా సాగడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ ముందుకెళ్లేలా కృషి చేయాలని ఈటలకు సూచించారు. శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడారు. 

బరాజ్ లోపాలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు, ఇంజినీర్లు తెలంగాణవాదం ముసుగులో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌లో లోపాలను పట్టించుకోకపోవడంతో, అవి మరింత పెరిగి ప్రాజెక్టు కుప్పకూలే స్థితికి చేరిందన్నారు. 2023 అక్టోబర్ 21 మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని,  ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేష నల్ నిర్వహణలో లోపాలున్నాయని 2023 నవంబర్ 1న ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందన్నారు.

డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చట్టం ప్రకారం దేశంలో ఎక్కడైనా నిర్దేశిత డ్యామ్‌ల పర్యవేక్షణ, నిర్వహణ, తనీఖీలు చేసే అధికారం ఎన్టీఎస్‌ఏకు ఉంటుందని.. కానీ బీఆర్‌ఎస్ వాళ్లు మాత్రం ఎన్డీఎస్‌ఏ తెలంగాణకే ఎందుకు వచ్చిందని మాట్లాడటం వి డ్దూరంగా ఉందన్నారు.  మేడిగడ్డను విజిట్ చేసిన ఎన్డీఎస్‌ఏ బరాజ్ ఏడో బ్లాకు దెబ్బతినడం వల్ల బరాజ్‌లో నీళ్లు నింపితే ప్రమాదమని ప్రాథమిక నివేదికలో చెప్పిందన్నారు.

వివిధ పరీక్షలు, క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలన అనంతరం తుది నివేదిక ఇచ్చిందని, అందులోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చిచెప్పిందని, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బరాజ్ స్పష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి, ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను సిఫారసు చేసిందని సీఎం తెలిపారు. 

నీళ్లు ఎత్తిపోసినా మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందే..

‘కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కనీస పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు కావాలని, ప్రస్తుతం అక్కడ 89.90 మీటర్ల మేరనే నీరుందని సీఎం స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల గేట్లు మూస్తే తప్ప చుక్క నీరు నిల్వ ఉండదన్నారు. ఆ బరాజ్‌లు సురక్షితంగా లేవని, గేట్లు మూసి నీటిని నిల్వ చేయరాదని ఎన్డీఎస్‌ఏ ఇప్పటికే  సూచించిందని, అలాంటప్పుడు నీళ్లు ఎత్తిపోయాలనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు.

అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లు మూసివేయటానికి వీల్లేదని ఎన్డీఎస్‌ఏ సూచిం చిందని.. కన్నెపల్లి నుంచి ఎత్తిపోసినా అక్కడ గేట్లు ఓపెన్ ఉన్నందున, అవి కూడా మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందే అని పేర్కొన్నారు.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద నిర్మాణపరమైన సమస్యలున్నాయని కేంద్ర సాంకేతిక పర్యవేక్షణ కమిటీ కూడా ఇటీవల స్పష్టం చేసిందన్నారు. 

కన్నెపల్లి నుంచి నీళ్లెత్తిపోయడం అసాధ్యం   

‘నేను యావరేజ్ స్టూడెంట్.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాకంటే మెరుగైన స్టూడెంట్.. కానీ, మేము మేధావులం అని కట్టినందుకే లక్ష కోట్ల కాళేశ్వరం కూలేశ్వరం అయింది’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఎజెండాను కొందరు రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగులు సమర్థించడం కుట్ర అన్నారు. ఇప్పటికప్పుడు కన్నెపల్లి పంపుహౌస్ వినియోగంలోకి రాదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం కేసీఆర్ ఏ బుర్రకథలు చెప్పినా విన్నామని, ఇప్పుడు కొడుకు బయలుదేరారని ఎద్దేవా చేశారు. కాళేళ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బరాజ్ వెన్నుపూస లాంటిదని, అలాంటి వెన్నుపూసే విరిగిందన్నారు. హరీశ్‌రావు తాటిచెట్టు లాగా పెరిగి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.  

హరీశ్‌రావును అతని మామనే నమ్మలేదు  

‘హరీశ్‌రావును ఆనాడు అతని మామనే నమ్మలేదు.. కమీషన్లు బుక్కిన సంగతి తెలిసి పక్కనబెట్టారని పేర్కొన్నారు. ఏపీ కోసమే కిందికి నీళ్లొదులుతున్నామని ఆరోపిస్తున్న హరీశ్‌రావు.. ఆనాడు ఆంధ్రా సంస్థలను విమర్శించి నారాయణ, చైతన్య సంస్థలకు పాలు పోసి బతికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రోళ్ల మోచేయి నీళ్లు తాగే హరీశ్‌రావు నీదీ ఒక బతుకేనా’ అని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో పట్టిసీమకు 105 టీఎంసీలు తరలించినప్పుడు గాడిదలు కాసారా? అని ప్రశ్నించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వినియోగంలోకి వస్తే పోలవరంకు నీళ్లు పోవని చెప్పగలరా.. అని నిలదీశారు. ‘మామ గుడిని మింగితే.. అల్లుడు గుడిలో లింగాన్ని మింగేవాడు. ఆ గజదొంగల గుంపులో చేరొద్దు’ అని ఈటల రాజేందర్‌కు హితవు పలికారు.  మామ లక్కీ నంబర్ ఆరు అని, 6 శాతం కమీషన్ అడిగితే.. నా లక్కీ నంబర్ 3 అని 3 శాతం హరీశ్‌రావు వసూలు చేశాడు, కేటీఆర్ 1 శాతం కమీషన్ వసూలు చేశారని ఆరోపించారు. మొత్తం  10 శాతం కమీషన్ వసూలు చేశారని పేర్కొ న్నారు.

పాత కమీషన్లు రాబట్టు కునేందుకే హరీశ్ ఇప్పుడు నీటి పారుదల శాఖ కావాలని అడుగుతున్నాడని సీఎం ఎద్దేవా చేశారు. ఆ కమీషన్ల భాగోతంతోనే వాళ్ల మామ హరీశ్‌ను ఏడాదిపాటు పక్కనపెట్టాడని ఆరోపించారు. హరీశ్ కమీషన్ల కక్కుర్తితో ఇప్పుడు క్రషర్లను కూడా వదలడం లేదని, లక్ష రూపాయలు కూడా డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. అరటి పండ్ల బండ్ల వద్ద కూడా వసూలు చేసేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు.