12 July, 2026 | 2:28 AM

అర్ధరాత్రి హత్యాకాండ

12-07-2026 01:22 AM

పోక్సో కేసు కక్షతో ఆరుగురి గొంతుకోసిన ఉన్మాది

  1. బాలిక, ఆమె తల్లి, నానమ్మతో సహా భార్య, ఇద్దరు పిల్లల బలి
  2. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఘటన 
  3. పోలీసులు పట్టించుకోలేదంటూ రోడ్డెక్కిన గ్రామస్తులు
  4. పరారీలో నిందితుడు రాజ్‌కుమార్ 
  5. షాబాద్ ఎస్సై, ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి/చేవెళ్ల, జూలై 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఉన్మాది క్రూరత్వంతో విరుచుకుపడ్డాడు. తనపై పోక్సో కేసు పెట్టిందనే కక్షతో ఓ బాలికను, ఆమె తల్లి, నానమ్మతో సహా తన భార్యను, ఇద్దరు పసిపిల్లలను కూడా కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. కేవలం రెండు గంటల వ్యవధిలో జరిగిన ఈ ఆరు హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది.

శుక్రవారం రాత్రి 11:47 గం టల సమయంలో నిందితుడు రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి, ‘నేను ఆరుగురిని చంపేశాను, నేనూ చనిపోతున్నా’ అని చెప్పి పరారయ్యాడు. బాలిక కుటుంబీకులు ముం దే మొరపెట్టుకున్నా రక్షణ కల్పించడంలో విఫలమయ్యారంటూ షాబాద్ ఎస్సై రాము లు, సీఐ కాంతారెడ్డిలను రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారు. నిందితుడి కోసం 7 ప్రత్యేక పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. 

ప్రేమ పేరిట వేధింపులు.. పోక్సో కేసుతో కక్ష

షాబాద్ మండలం దైవాలగూడకు చెం దిన రాజ్‌కుమార్ కొంతకాలంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ బాలిక (17)ను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. శంషాబాద్‌లోని కాలేజీ వ ద్దకు వెళ్లి కూడా ఇబ్బందులు పెట్టడంతో, భయపడిన తల్లి ఆమెను కాలేజీకి పంపడం మానేసింది. చివరికి పరీక్షల సమయంలో కూడా బాలికను లాక్కెళ్లేందుకు ప్రయత్నించ గా తల్లి అడ్డుకుంది.

ఈ క్రమంలోనే బాలిక తండ్రి మల్లేష్ (విద్యుత్ శాఖ ఉద్యోగి) గతం లో అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆ మరణం వెనుక కూడా రాజ్‌కుమార్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు భరించలేక బాలికతో తన తల్లి మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే, ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకా శం ఉండటంతో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతూ సదరు కుటుంబానికి నిరంతరం మృత్యుపాశంలా మారాడు.

పోక్సో కేసు పెట్టారని..

పోక్సో  కేసులో బెయిల్‌పై బయటకు వ చ్చిన రాజ్‌మార్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ బాలిక కుటుంబాన్ని అంతమొందిం చాడు. శనివారం రాత్రి షాబాద్‌లోని బాలిక ఇంటి వెనుక ఉన్న స్టేడియం వద్ద కారును సిద్ధంగా ఉంచిన రాజ్‌కుమార్.. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న బాలిక తల్లి చాకలి లక్ష్మి (45), నానమ్మ చాకలి రుక్క మ్మ (65)లను కత్తితో పొడిచి హతమార్చాడు.

భయంతో వణికిపోతున్న బాలికను బలవంతంగా కారులోకి లాక్కెళ్లి, దైవాలగూడ చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతానికి తీసుకె ళ్లి గొంతుకోసి చంపేశాడు. ఆశ్చర్యకరంగా బాలిక మృతదేహం పక్కన 7 ఇటుకలు పేర్చి ఉండటం చర్చనీయాంశమైంది. గతంలో చ నిపోయిన బాలిక తండ్రితో కలిపి ఇది 7వ హత్య అని సంకేతమిచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

పిల్లలను చూస్తానంటూ..

మూడు హత్యలు చేసిన అనంతరం రాజ్‌కుమార్ తన భార్య పార్వతి సరిత (30)కు ఫోన్ చేశాడు. పిల్లలను ఒక్కసారి చూసి వెళ్లిపోతానంటూ ఫోన్‌లో కన్నీరుమున్నీరవుతూ భావోద్వేగ నాటకం ఆడాడు. భర్త మాటల్లోని మోసాన్ని గ్రహించలేక, పిల్లలపై ప్రేమే మోనని నమ్మిన సరిత అతడిని వారి స్వగ్రామమైన దైవాలగూడలోని ఇంటికి రానిచ్చింది. ఇంట్లోకి రాగానే రాజ్‌కుమార్ అసలు రూపం బయటపెట్టాడు.

మొదట సరితను కత్తితో పొడిచి చంపాడు. భార్యను చంపిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోతున్న తన ఇద్దరు కన్నబిడ్డలు పరీక్షిత్ (3), దైవీక్షిత్ (2)లను సైతం ఏమాత్రం జాలి లేకుండా కిరాతకంగా హతమార్చాడు. కాగా సరితను ఏడేళ్ల క్రితమ రాజ్‌కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.

పోలీసుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం 

రాజ్‌కుమార్ వల్ల తమకు ప్రాణహాని ఉన్నదని, నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు పలుమార్లు షాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్థులు, బంధువులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. పోలీసులు మామూళ్ల కు అలవాటు పడి సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆరు ప్రాణాలు గాల్లో కలి శాయని ఆరోపిస్తూ షాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు స్పందిం చి, విధి నిర్వహణలో అలసత్వం వహించినందు కు గానూ షాబాద్ ఎస్సై రాములు, సీఐ కాం తారెడ్డిలను సస్పెండ్ చేశారు. 

బాలిక అక్కకు 5 లక్షల ఆర్థిక సాయం

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, కాలే యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్ బాధితులను పరామర్శించారు. బా లిక కుటుంబంలో మిగిలిన ఏకైక సభ్యురాలు, దివ్యాంగురాలైన అక్కను ఆదుకోవా లని డిమాండ్ చేయగా.. కలెక్టర్ నారాయణరెడ్డి తక్షణ సహాయం కింద రూ.5 లక్షల ఆర్థిక పరిహారాన్ని ప్రకటించారు.

నిందితుడి కోసం గాలింపు

ఈ ఘోర కలికంపై సైబరాబాద్ సీపీ తరుణ్ జోషి స్పందించారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలో భూతగాదాలు, పోక్సో కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఉన్మాదిని పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి (రివార్డు) అందజేస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ ప్రకటించారు.

మృతదేహాలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైనప్పుడు అతన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించామని చెప్పారు. శ్రీశైలం ఫారెస్ట్‌లో కూడా వెతికినట్టు తెలిపారు. నిందితుడు షాద్‌నగర్ ప్రాంతంలో తిరిగినట్లు సిగ్నల్స్ ద్వారా తెలుస్తున్నదని చె ప్పారు.

అతనితో పాటు శుక్రవారం రాత్రి మద్యం సేవించిన వారిని విచారిస్తున్నామని, కాల్ డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరుగుతున్నామని చెప్పారు. నలుగురిని అదుపులోనికి తీసుకుని విచారణ జరుపుతున్నామని తెలిసింది. రాజ్‌కుమార్ తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

భద్రతా వైఫల్యానికి సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

హైదరాబాద్ మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనడానికి షాబాద్ ఘటన నిదర్శనమన్నారు. పోక్సో నిందితుడికి బెయిల్ ఇప్పించి ఆరుగురి ప్రాణాలు బలిగొనే పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని ఆరోపించారు.

నిందితుల పలుకుబడి, డబ్బు ప్రభావం ముందు ప్రభుత్వం తలవంచి ప్రజల ప్రాణాలను, మహిళల భద్రతను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చాడని ఆరోపించారు. బాలిక కుటుంబ సభ్యులు నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని వేడుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.

కన్నీటి సంద్రంలో అంత్యక్రియలు

ఉన్మాది రాజ్‌కుమార్ చేతిలో బలైపోయిన ఇంటర్ విద్యార్థిని, ఆమె తల్లి, నానమ్మల మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. అంబులెన్సులో మృతదేహాలను షాబాద్‌కు తరలిస్తున్న రహదారి జనసంద్రంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో షాబాద్ గ్రామం కన్నీటి పర్యంతమైంది. అక్షయ కుటుంబ సభ్యుల అంతిమయాత్రకు గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. షాబాద్ విద్యుత్ సబ్-స్టేషన్ పక్కన ఉన్న శ్మశానవాటికలో ముగ్గురి అంత్యక్రియలను నిర్వహించారు. బాలిక అక్షయ తాత, తండ్రి గతంలో ఇదే సబ్ స్టేషన్లో పని చేయడం గమనార్హం. వారు విధులు నిర్వహించిన ప్రదేశం పక్కనే అంత్యక్రియలు జరగడంతో.. అక్కడికి వచ్చిన సహోద్యోగులు, గ్రామస్తులు వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసు కుంటూ కన్నీరుమున్నీరయ్యారు.