15 March, 2026 | 4:51 PM

డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు

15-03-2026 04:00 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వినియోగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ, పౌరసరఫరాలు, మున్సిపల్ శాఖల అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృతస్థాయి తనిఖీలు చేపట్టాలని, ప్రస్తుతం జిల్లాలో ఎల్ పి జి, పెట్రోల్ కొరత లేదని తెలిపారు. ఎల్పీజీ గోదాముల, పెట్రోలు బక్కుల వద్ద స్టాకు వివరాలను పట్టికలో ప్రదర్శించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రోజుకు 2 వేల చొప్పున బుకింగ్ చేసుకున్న వారికి  సిలిండర్లు అందించడం జరుగుతుందని, ప్రతిరోజు ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, పంపిణీ వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. విద్యాసంస్థలు, వసతి గృహాలు, గురుకులాల అవసరాలకు సరిపడా సిలిండర్లు అందించాలని, హోటల్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు ఎట్టి పరిస్థితులలో డొమెస్టిక్ సిలిండర్ లను వ్యాపారానికి వినియోగించరాదని తెలిపారు. పెట్రోల్ బంకులలో పెట్రోల్ ను ప్లాస్టిక్ క్యానులలో పోయరాదని తెలిపారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు, పట్టణ ప్రాంతాలలో 25 రోజుల సిలిండర్ల బుకింగ్ గడువు ఉందని, పత్రికలు, మీడియా/సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలపై వెంటనే స్పందించి అదే రోజు జిల్లా పౌర సంబంధాల అధికారికి రిజాయిండర్లను సమర్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రవాణా, అగ్నిమాపక, సంక్షేమ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,  ఎల్ పి జి డీలర్లు, పెట్రోల్ బంకుల యజమానులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.