13 March, 2026 | 7:56 AM

గ్యాస్ అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటాం : కలెక్టర్ అంకిత్

13-03-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12, (విజయక్రాంతి): జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, గ్యాస్ సిలిండలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఐడీఓసి కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, పౌరసరఫరాల శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన సాగుభూమి వివరాలు, ప్రస్తుత సాగు పరిస్థితులు, ప్రధాన పంటల వివరాలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతుభరోసా, రైతు భీమా పథకాల అమలు, లబ్ధిదారుల సంఖ్య, రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. 

ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి లభ్యత తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకొని,జిల్లాలో సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు అవసరమైన నీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఈ సందర్భంగా జిల్లాలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై కూడా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే అధిక మొత్తంలో బుకింగ్ చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పోరాసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, పోరసరఫరాల మేనేజర్ త్రినాధ్ బాబు,ఇరేగేషన్ ఈ ఈ అర్జునరావు, ఇరేగేషన్ శాఖ ఏ ఈ లు, సంభంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.