17 March, 2026 | 2:37 AM

సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

17-03-2026 01:27 AM
  1. అధిక ధరలకు విక్రయిస్తే డీలర్ షిప్పులు రద్దు 

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల, మార్చి 16: వంట గ్యాస్ సిలిండర్లను ఎవరైనా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమాలకు పాల్పడిన డీలర్ల డీలర్ షిప్పులను రద్దు చేయిస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని తనకు పంపాలని కోరారు.

ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడిందని ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో సోమవారం ఆయన వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై జిల్లా సివిల్ సప్లయిస్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లకు కొరత అంటూ ఏమీ లేదని, సిలిండర్లను బుక్ చేసిన వారందరికీ వాటిని సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు చెప్పారు.

కాగా మున్ముందు సిలిండర్లు దొరకడం కష్టమౌతుందన్న ప్రచారంతో ప్రజలు ఒకేసారి సొలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వచ్చి బారులు తీరుతుండటంతో సిలిండర్లు దొరకడం లేదనే భావన కలుగుతోందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అన్ని ఏజెన్సీల వద్ద ఇవే పరిస్థితులు కనిపించడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. పరిస్థితులను సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.