ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తనపై విద్యార్థి నాయకుడి ఆగ్రహం
భిక్కనూరు, ఆగస్టు 20: భిక్కనూరు మండలంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో వసతుల లోపాలను పరిశీలించడానికి వెళ్లిన తనతో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించారని విద్యార్థి నాయకుడు తుడుం ప్రదీప్ తెలిపారు. పాఠశాలలో అధ్వానంగా మారిన మరుగుదొడ్లు, భోజనశాలలో అపరిశుభ్రత, పగిలిపోయిన వాటర్ ట్యాంక్ వంటి సమస్యలపై తాను ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించినట్లు ప్రదీప్ వెల్లడించారు.
ఇదే సమయంలో రెండు రోజులు గైర్హాజరైన ఓ విద్యార్థి నుంచి రూ.200 ఫైన్ వసూలు చేసి, ఆ డబ్బుతో గోడకు పెయింట్ వేయిస్తామని చెప్పడాన్ని తాను నిలదీశానని తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్ నువ్వెవరు? ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనపై బాధ్యతారహితంగా, దురుసుగా ప్రవర్తించారని ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఫైన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై మరియు మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.






