అవకాశాలకు దూరమవుతున్న విద్యార్థులు
మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
ఉన్నత విద్యా మండలి ముట్టడి ఉద్రిక్తం
ఫీజు బకాయిల విడుదలకు విద్యార్థి జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఫీజు బకాయిల కారణంగా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉన్నత విద్యా మండలిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జీఓ ఎంఎస్ 8, 9లను రద్దు చేసి పాత విధానంలో ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలని, రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి స్పందిస్తూ ఫీజు బకాయిల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విడుదలకు కృషి చేస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలలు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వ్యాఖ్యానించలేనని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో విద్యార్థి ఉద్యమం చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. జూలై 7న ’చలో ఇందిరా పార్క్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నందగోపాల్, ఉదయ్(రక్షక దళం), నరేష్(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), జగన్, ప్రవీణ్, హరీష్, మహేష్, అనిత, వంశీ తదితరులు పాల్గొన్నారు.






