తల్లిదండ్రుల లక్ష్య సాధనకు.. విద్యార్థినీలు కృషి చేయాలి
ఇంటర్మీడియట్ విద్యే భవిష్యత్తుకు కీలక మలుపు
జిల్లా కళాశాలల నోడల్ అధికారి సలాం
బాన్సువాడ, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు, లక్ష్యాలతో కష్టపడుతున్నారని, ఆ లక్ష్యాలను సాకారం చేసే బాధ్యత విద్యార్థినీలపై కూడా ఉందని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సలాం పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా నోడల్ అధికారి సలాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారి సలాం మాట్లాడుతూ విద్యార్థినీలు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో సాధించే మంచి ఫలితాలు భవిష్యత్తు విద్య, ఉద్యోగ అవకాశాలకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థినీలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అస్సద్ ఫరూక్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శివకుమార్, అధ్యాపకులు గంగాధర్ శ్రీనివాస్ రమేష్ పద్మ రమ్యశ్రీ స్వప్న విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.