20 August, 2026 | 8:55 PM

మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలి

20-08-2026 08:21 PM

- భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ

మణుగూరు,(విజయక్రాంతి): ప్రజలకు విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా  సంబంధిత అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సూచించారు. గురువారం ఆయన మున్సిపాలిటి పరిధిలోని బాలల సదనం, ఎంపియుపిఎస్ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయా కేంద్రాల్లో వసతులు, అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.

తొలుత బాలల సదనం విద్యార్ధులతో సబ్ కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను, వసతి, భోజనం, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత, భోజన మెనూ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, పరిశుభ్రతను పరిశీలించి విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బాలల సదనంలో విద్యార్థుల సౌకర్యార్ధం డైనింగ్ టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రికల్ మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ కమీషనర్ ప్రసాద్, తహశీల్దార్ అద్దంకి నరేష్ ను ఆదేశించారు. విద్యార్ధుల అభిరుచులకు అనుగుణంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని సాయంత్రం సమయంలో అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఎంపియుపిఎస్ పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను, భోజనాన్ని అందించాలని సూచించారు. విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. అనంతరం పిహెచ్సిని సందర్శించి ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన పిల్లలకు, గర్భిణీలకు పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ కమీషనర్ ప్రసాద్, తహశీల్దార్ అద్దంకి నరేష్, వార్డెన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిహెచ్సి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు