7 March, 2026 | 10:08 PM

కుప్పకూలిన సుఖోయ్ జెట్

07-03-2026 12:34 AM
  1. ఆపరేషన్ సిందూర్ పైలట్ మృతి
  2. ప్రమాదంలో మరొకరు కూడా..
  3. అస్సాం రాష్ట్రంలో దుర్ఘటన
  4. సుఖోయ్ జెట్ అదృశ్యం ఘటన విషాదాంతం

దిస్పూర్, మార్చి 6:  భారత  వాయుసేనకు చెందిన సుఖోయ్- రకం యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో జెట్‌లోని ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. కాగా, మృతుల్లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్ కూడా ఉన్నారు.  ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.

ఈ యుద్ధ విమానం గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గల్లంతైంది. రాడార్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ వైమానిక స్థావరానికి 60 కి.మీల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు తాజాగా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోవడంతో సుఖోయ్ అదృశ్యం ఘటన చివరకు విషాదాంతంగా ముగిసింది.  

నాడు విరోచితంగా పోరాడి..

సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాద మృతుల్లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్  లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్కర్(28) ఉన్నారు. ఆయన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నారు. పూర్వేశ్ మృతి చెందడంతో నాగపూర్‌లోని వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. పూర్వేశ్ తండ్రి రవీంద్ర దురాగ్కర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.

బుధవారం రోజే కుమారుడితో మాట్లాడామని, కానీ ఇంతలోనే ఈరోజు గ్రూప్ కెప్టెన్ ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి తెలియజేశాడని రవీంద్ర కంటతడిపెట్టారు. దేశానికి సేవ చేయాలనే మక్కువతో తన కుమారుడు యుద్ధ విమానం పైలట్‌గా మారాడాని పేర్కొన్నారు. దేశం కోసం యుద్ధ విమానాలను నడిపిన తన కుమారుడిని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పూర్వేశ్ పాల్గొన్నారు.