29 April, 2026 | 1:32 PM

వేసవి శిబిరాలకు ఫుల్ డిమాండ్

28-04-2024 01:08 AM

కొనసాగుతున్న ఆన్‌లైన్ నమోదు 

మే 31 వరకు కొనసాగనున్న శిబిరం 

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి 

స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): గ్రేటర్ వ్యాప్తంగా యేటా జీహెచ్‌ఎంసీ నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొత్తం 150 డివిజన్లలో 44 క్రీడాంశాలలో ఇండోర్, అవుట్ డోర్ పద్ధతుల్లో శిక్షణ ఉంటుంది. ఈ నెల 25న ప్రారంభమైన సమ్మర్ కోచింగ్ క్యాంపు మే 31 వరకు కొనసాగుతోంది. ఈ శిక్షణకు 2022లో 24 వేల మంది క్రీడాకారులు ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్ చేసుకోగా, 2023లో 42 వేల మంది క్రీడాకారులు పాల్గొని శిక్షణ పొందారు. 2024 ఏడాదిలో సమ్మర్ కోచింగ్ క్యాంపునకు హజరయ్యే వారు ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. నగరంలో 900లకు పైగా ప్రాంతాల్లోలో వేసవి శిబిరం ద్వారా శిక్షణ పొందేవారికి స్పోర్ట్స్ మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్తారు. 

ఆన్‌లైన్ నమోదు ప్రారంభం 

హైదరాబాద్ మహా నగరంలో 364 ప్రాంతాల్లో 915 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, కరాటే, జిమ్నాస్టిక్స్, హాకీ, కారమ్స్, కిక్ బాక్సింగ్, ఫుట్ బాల్, రెజ్లింగ్, బాడీ బిల్డింగ్, స్విమ్మింగ్, థైక్వాండో, యోగా, టేబుల్ టెన్నీస్, కబడ్డీ, ఆర్చరీ తదితర 44 క్రీడాంశాల్లో శిక్షణ ప్రారంభించారు. మొత్తం 878 కోచ్‌లు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది రూ. 2.10 కోట్ల నిధులను అధికారులు కేటాయించారు. ఈ సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్యాంపు కార్యక్రమం ఈ నెల 25న కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు, చందానగర్ ప్రాంతాలలో జీహెచ్‌ఎంసీ  కమిషనర్ ప్రారంభించారు. ఈ మూడు రోజుల్లోనే సుమారు 5,786 మంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు వేసవి శిబిరానికి నమో దు చేసుకున్నారు. 

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు, క్రీడాకారులు సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. 6 నుంచి 16 సంవత్సరాల బాలబాలికలు క్రీడా నైపు ణ్యాలను పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణా శిబిరాలు దోహదపడుతాయి. ఐదు రోజుల్లోనే 5,7౮౬ మంది ఆన్‌లైన్ ద్వారా ఎన్‌రోల్ చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాదిలా  ఈసారి కూడా 42 వేల మంది నమోదు చేసుకుంటారని భావిస్తున్నాం. 

 యాదగిరి రావు, స్పోర్ట్స్ విభాగం అడిషనల్ కమిషనర్