సంగారెడ్డి వరకు మెట్రోకు కృషి

28-04-2024 01:11:26 AM

l నిజాం షుగర్స్‌ను తెరిపిస్తాం

l ఇందిరమ్మ గడ్డలో పోటీ అదృష్టం

l ‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో  కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

మెదక్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): దేశానికి ప్రధానిని అందించిన మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలన మరోసారి అందించడానికి తనకు కలిగిన అవకాశమని, బలహీనవర్గానికి చెందిన తనను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని చెప్పారు. తనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం అందిస్తున్నారని అంటున్నారు. తాను ఎంపీగా గెలిస్తే రైతులకు, కార్మికులకు అండగా ఉండటమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని, ఇందిరమ్మ చేసిన అభివృద్ధి మినహా మరేమీ కనింపడంలేదని పేర్కొంటున్నారు. తాను ఎంపీగా గెలిస్తే మెదక్ లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చెప్పారు. మరిన్ని అంశాలపై ఆయన మనోభావాలను పంచుకున్నారు.

ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నుంచి పోటీ చేయడం ఎలా అనిపిస్తున్నది?

ఇందిరాగాంధీ నాడు మెదక్ నుంచి గెలిచి ప్రధాని అయ్యారు. అలాంటి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీ కల్పించిన అదృష్టం. 25 ఏండ్ల క్రితం వరకు కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించారు. మళ్లీ ఇందిరమ్మ పేరు నిలబెట్టేలా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందిరాగాంధీ వల్ల మెదక్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. నిరుపేదలకు ఎన్నో సేవలందించారు. బలహీనవర్గాల నుంచి నేను ఈ స్థానం నుంచి పోటీచేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. 

మీరు గెలిస్తే చేపట్టే అభివృద్ధి పనులు?

నేను ఎంపీగా గెలిచాక జాతీయ రహదారుల అభివృద్ధితోపాటు సంగారెడ్డి వరకు మెట్రో లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా. ఎంపీ నిధులతో అన్ని ప్రాంతాల్లో సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడుతా. నిరుపేదలకు కూడు, గూడు కల్పించడానికి కృషి చేస్తా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిరంతర కృషి చేస్తా. మంభోజిపల్లిలో మూతపడిన నిజాం షుగర్స్‌ను తెరిపించేందుకు కృషి చేస్తా. పేదల కోసం అవసరమైతే సొంత నిధులు కూడా ఖర్చు చేస్తా.

బీఆర్‌ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఎలా గెలుస్తారు ?

బీఆర్‌ఎస్ పార్టీ గత పదేండ్లుగా మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్‌ఎస్ గెలుపొందినప్పటికీ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై నమ్మకం పెట్టకున్నారు. మొదటినుంచి ఈ నియోజకవర్గంలో గ్రామ, మండలస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో సహకారం అందుతున్నది. బీసీ వర్గానికి చెందిన వారందరి ఆశీర్వాద బలం నాకున్నది.

కాంగ్రెస్‌లోకి వలసలు మీకు బలాన్నిస్తుందా?

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన ఆరు గ్యారెంటీలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడతాయి. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది శుభపరిణామం. నా గెలుపునకు తప్పకుండా వారందరి సహకారం ఉంటుంది. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నాం.  

కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలను ఎలా ఎదుర్కొంటారు?

ఎక్కడా కూడా గ్రూపు తగాదాలు లేవు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తున్నారు. నాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు అందరినీ కలుపుకుపోతున్నాం. 

మీకు ప్రత్యర్థి ఎవరు?

ప్రత్యర్థి ఎవరైనా కానీ గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. పార్టీ నాయకత్వ సహకారం, ప్రజల అదరణతో ప్రత్యర్థి ఎవరున్నా గెలుపు నాదే.