రాజస్థాన్‌ను ఆపతరమా?
సన్‌రైజర్స్ బౌలర్లకు పరీక్ష
వైభవ్‌పైనే అందరి చూపు
ఉప్పల్‌లో పరుగుల వరదే
హైదరాబాద్, ఏప్రిల్ 12: ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని జట్లు అంచనాలకు తగ్గట్టే అదరగొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో దుమ్మురేపుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ గెలిచి టాప్ ప్లేస్ లో ఉంది. అలాంటి టీమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన హోంగ్రౌండ్‌లో ఎదుర్కొనబోతోంది.
ఆ డిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒకటే గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టి కలో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో బ్యాటింగ్ పరంగా రాణిస్తున్నా బౌలింగ్ బలహీనంగా ఉండడంతో ఆరెంజ్ ఆర్మీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మరి ఈ బౌలింగ్‌తో ఉప్పల్ స్టేడియం లాంటి ఫ్లాట్ వికెట్‌పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను సన్‌రైజర్స్ ఎంతవరకూ అడ్డుకుంటుందో చూడాలి. రాజస్థాన్ జట్టులో అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.
పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లో రెండు సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసిన వైభను అడ్డుకోవడంపైనే సన్‌రైజర్స్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అలాగే జైస్వా ల్, జురెల్ కూడా ఫామ్‌లో ఉండడంతో హైదరాబాద్ బౌలర్లకు సవాల్‌గానే చెప్పాలి. అటు రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్, బర్గర్, రవి బిష్ణోయ్ రాణిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా సందీప్ శర్మను ఆడించే అవకాశముం ది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఒత్తిడిలో కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలర్లు ఫ్లాప్ అవుతున్నారు.
గత మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన ఓటమికి కారణం చెత్త బౌలింగే. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, హెడ్ కూడా ఫామ్ లోకి రావడం జట్టు కు కలిసొచ్చే అంశం. అయితే పంజాబ్ కింగ్స్‌పై వీరిద్దరూ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు అనుకున్నంత వేగంగా ఆడలేకపోవడం కూడా ఓటమికి కారణమైంది. క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌పైనా విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కూడా కొం పముంచాయి. ఇక బౌలింగ్ సంగతి సరేసరి.
ఈ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అందరికీ అర్థమవుతోంది. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు తెలుస్తోంది. బౌలింగ్‌లో హర్షల్ పటేల్, ఉనాద్కట్ రాణించడం లేదు. ఎహసాన్ మలింగ ఒక్కడే పర్వాలేదనిపిస్తుండగా హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌పై బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ ఇలాగే ఉంటే 250 ప్లస్ స్కోరు చేసినా ఉపయోగముండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




