రఫ్ఫాడించిన ఆర్‌సీబీ
హోంగ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్‌కు షాక్
కోహ్లీ, సాల్ట్, పటిదార్ హాఫ్ సెంచరీలు
ఛేజింగ్‌లో పోరాడి ఓడిన ముంబై
చివర్లో సరిపోని రూథర్‌ఫర్డ్ విధ్వంసం
ముంబై, ఏప్రిల్ 12: ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ తాజాగా తన చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ అభిమా నులను అలరించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ , విరాట్ కోహ్లీ మెరుపు బ్యాటింగ్ తో అలరించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 120 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాల్ట్ విధ్వంకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. కేవ లం 36 బంతుల్లోనే 76( 6 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేశా డు. అటు కోహ్లీ 38 బంతుల్లో 50 (5 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా.. తర్వాత రజత్ పటిదార్ కూడా మెరుపులు మెరిపించాడు. తన ఫామ్ కొనసాగిస్తూ కేవలం 20 బంతుల్లోనే 53 (4 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు.
చివర్లో టిమ్ డేవిడ్ కూడా ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. ఫలితంగా ఆర్సీ బీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 35 పరుగులే ఇచ్చినా వికెట్ తీయలేకపోయాడు. తదా్వారా ఐదు మ్యాచ్‌లలోనూ వికెట్ తీయని బౌల ర్‌గా నిలిచాడు.తర్వాత ఛేజింగ్‌లో ముంబై దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది.
రికల్టన్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. అయితే రోహిత్ శర్మ గాయంతో రిటైర్డ్ హర్ట్ అవ్వడం ముంబై జోరుకు బ్రేక్ వేసినట్టయింది. రికల్టన్ 37, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులకు ఔటవగా.. తిలక్ వర్మ (1) మరోసారి ఫెయిలయ్యాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా తనదైన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 22 బంతుల్లో 40 (6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రూథర్ ఫర్డ్ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చివరి వరకూ వణికించాడు. భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు.
ఈ పవర్ హిట్టర్‌ను వేలంలో ముంబై ఎందుకు తీసుకుందో అందరికీ అర్థమైంది. మరో ఎండ్‌లో సపోర్ట్ లేకున్నా ముంబైని గెలిపించేందుకు చివరి వరకూ రూథర్ ఫర్డ్ పోరాడాడు. కేవలం 31 బంతుల్లోనే 71 పరుగులు చేయగా 1 ఫోర్, 9 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. అలాగే రూథర్ ఫర్ కు చివర్లో మరొక ఎండ్‌లో సపోర్ట్ లభించి ఉంటే ముంబై గెలిచేది. చివరికి ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులుకు పరి మితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ 2 వికెట్లు తీసా డు. కాగా ఆర్సీబీకి ఇది మూడో విజయం.




