30 June, 2026 | 10:26 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నమీబియా సూపర్ విక్టరీ

04-06-2024 03:26 AM

పొట్టి ప్రపంచకప్‌లో పసికూనలు అనుకున్న జట్లు.. దుమ్మురేపుతున్నాయి. తొలి రోజు కెనడాపై అమెరికా రికార్డు లక్ష్యాన్ని ఛేదించగా.. రెండో రోజు ఒమాన్‌పై నమీబియా సూపర్ ఓవర్‌లో విక్టరీ కొట్టింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా.. నమీబియా ఆరు బంతుల్లో 21 పరుగులు చేసింది. ఛేదనలో ఒమాన్ 10 పరుగులకే పరిమితమవడంతో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో అటు బ్యాట్‌తో విజృంభించిన డేవిడ్ వీజ్.. ఇటు బంతితోనూ మ్యాజిక్ చేసి నమీబియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరోపోరులో శ్రీలంకపై దక్షిణాఫ్రికా సునాయాస విజయం సాధించింది. నోర్జే, రబడ, కేశవ్ ధాటికి లంకేయులు పెవిలియన్‌కు వరుస కట్టగా.. సునాయాస లక్ష్యాన్ని సఫారీలు ఆడుతూ పాడుతూ ఛేదించారు. 

బ్రిడ్జ్‌టౌన్: భారీ స్కోర్లు, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో టీ20 ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. మెగాటోర్నీలో భాగంగా సోమవారం జరిగిన తొలి పోరులో ఒమాన్‌పై నమీబియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమాన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ కాగా.. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. అందులో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా.. ఛేదనలో ఓమన్ 10 రన్స్ మాత్రమే కొట్టడంతో నమీబియా విజేతగా నిలిచింది.

గ్రూప్ భాగంగా జరిగిన మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు రాణించడంతో తొలుత ఒమాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఖాలిద్ (34) టాప్ స్కోరర్ కాగా.. నమీబియా బౌలర్లలో ట్రంపెల్‌మాన్ 4, డేవిడ్ వీజ్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (45) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి. ఒమాన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు సూపర్ ఓవర్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన డేవిడ్ వీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

శ్రీలంక 77 ఆలౌట్

న్యూయార్క్: బౌలర్ల హవా సాగుతున్న ప్రపంచకప్‌లో సఫారీల ధాటికి శ్రీలంక ఘోర పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ భాగంగా సోమవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో లంకపై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. సఫారీ పేసర్లు అన్రిచ్ నోర్జే (4/7), కగిసో రబడ (2/21) రెచ్చిపోవడంతో లంకేయులు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. కుషాల్ మెండిస్ (19), కమిండు మెండిస (11), ఏంజెలో మాథ్యూస్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. పాథుమ్ నిషాంక (3), కెప్టెన్ హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6), షనక (9) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో నోర్జే, రబడతో పాటు కేశవ్ మహరాజ్ (2/22) రాణించాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. అతి జాగ్రత్తకు పోయిన సఫారీలు 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి విజయం సాధించారు. క్వింటన్ డికాక్ (20), కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (12), స్టబ్స్ (13), హెన్రిచ్ క్లాసెన్ (19 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. సఫారీల ఇన్నింగ్స్‌లోనూ మూడేసి ఫోర్లు, సిక్సర్లు మాత్రమే నమోదవడం కొసమెరుపు. 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన నోర్జేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 

కప్పు విజేతకు ౨౦ కోట్లు

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికె ట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించిం ది. గత టోర్నీతో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఈ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ అక్షరాల రూ. 93 కోట్లకు (11.25 మిలియన్ల అమెరికా డాలర్లు) పైమాటే. 2022 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ రూ. 46 కోట్లతో పోలిస్తే ఈసారి డబుల్ అవ్వడం విశేషం.

టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు రూ.20 కోట్ల 36 లక్షలు సొం తం చేసుకోనుండగా.. రన్నరప్‌కు రూ. 10 కో ట్ల 64 లక్షలు దక్కనుంది.  గత టోర్నీలో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ అందుకున్న ప్రైజ్‌మనీ రూ. 13 కోట్ల 30 లక్షలతో పోలిస్తే ఈసారి  చాంపియన్‌కు రూ. 7 కోట్లు ఎక్కువగా అందనుంది. ఇక సెమీఫైనల్లో ఇంటిబాట పట్టే జట్లకు రూ. 6 కోట్లకు పైగా, సూపర్ లీగ్ దశకు పరిమితమయ్యే జట్లకు కూడా మంచి ప్రైజ్‌మనీ లభించనుంది. 

చాంపియన్ వేట షురూ

బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్‌లో నేడు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. గ్రూప్ భాగంగా బ్రిడ్జ్‌టౌన్ వేదికగా స్కాట్లాండ్‌తో బట్లర్ సేన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవలే సొంతగడ్డపై పాకిస్థాన్‌ను 2 చిత్తు చేసిన ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో మెగాటోర్నీకి సన్నద్ధమయింది. జట్టులో ఒకటి నుంచి తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లతో ఇంగ్లండ్ పటిష్టంగా కనిపిస్తోంది.

ఐపీఎల్లో కోల్‌కతా ఓపెనర్‌గా అదరగొట్టిన ఫిల్ సాల్ట్‌పై అందరి దృష్టి నెలకొం ది. ఇక కెప్టెన్ బట్లర్, మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్‌లతో బ్యాటింగ్ విభాగం శత్రుదుర్భేద్యంగా కనిపిస్తుంది. బౌలింగ్ విషయాని కొస్తే స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం జట్టులో జోష్ నింపనుంది. మరో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉగాండాతో తలపడనుంది.