30 June, 2026 | 9:31 PM

Breaking News

కేదార్ జాదవ్ కెరీర్‌కు గుడ్‌బై

04-06-2024 03:30 AM

పుణే: టీమిండియా వెటరన్ క్రికెటర్ కేదార్ జాదవ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2014లో లేటు వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాతీయ జట్టు తరపున 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టీ20ల్లో 122 పరుగులు సాధించాడు. జాదవ్ కెరీర్‌లో రెండు వన్డే సెంచరీలు, 7 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో తన ఆఫ్ స్పిన్‌తో 27 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల జాదవ్ టీమిండియా తరపున నాలుగేళ్ల క్రితం చివరి మ్యాచ్ ఆడాడు. జాదవ్ తన రిటైర్మెంట్ విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టుల్‌ను అనుసరించాడు. ‘నా కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇవాళ 15:00 గంటల నుంచి నేను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు పరిగణించండి’ అని కేదార్ జాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశాడు.

గతంలో ధోనీ కూడా ఆగస్టు 15, 2020న సాయంత్రం 19:29 గంటలకు రిటైరయ్యాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. లేటు వయసులో జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ 2017లో ఇంగ్లండ్‌పై వచ్చింది. పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 351 పరుగులు ఛేదించే క్రమంలో 76 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. . విరాట్ కోహ్లీ (122)తో కలిసి ఐదో వికెట్‌కు 147 బంతుల్లోనే 200 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కేదార్ జాదవ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న జాదవ్ కొల్హాపూర్ టస్కర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.