క్వార్టర్స్‌లో బోపన్న
మట్టికోటపై భారత స్టార్ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బోపన్న జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సహచర ఆటగాడు శ్రీరామ్ బాలాజీ జంట అద్వితీయంగా పోరాడినప్పటికీ బోపన్న అనుభవం ముందు తలవంచాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్‌లో రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన మెద్వెదెవ్ ప్రిక్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంకా, రైబాకినాలు తమ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ చేరారు.
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రోహన్ బోపన్న ద్వయం దుమ్మురేపింది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో సోమవారం బోపన్న ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6 (2/7), 6 7 (10/8)తో శ్రీరామ్ బాలాజీ వరేలా మార్టినేజ్ (మెక్సికో) జంటను ఓడించింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ రెండో సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మూడో సెట్ మరోసారి టై బ్రేక్‌కు దారి తీయగా.. బోపన్నఎబ్డెన్‌లు తమ అనుభవాన్ని రంగరించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్‌కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగిన మెద్వెదెవ్ ప్రిక్వార్టర్స్‌లో ఇంటిదారి పట్టాడు. నాలుగో రౌండ్‌లో మెద్వెదెవ్ 6 2 1 3 అలెక్స్ డీ మినార్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 2 గంటల 49 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్‌లో 7 ఏస్‌లు కొట్టిన అలెక్స్ 51 విన్నర్లు సంధించి మెద్వెదెవ్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు.
క్వార్టర్స్‌కు సబలెంకా
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకా (బెలారస్) క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా 6 6 ఎమ్మా నవ్వారో (అమెరికా)పై సునాయాస విజయాన్ని సాధించింది. గంటా 9 నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంకా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో సబలెంకా 7 ఏస్‌లు, 36 విన్నర్లు సంధించి ప్రత్యర్థిని చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో 4వ సీడ్ ఎలినా రైబాకినా (కజకిస్థాన్) స్వితోలినాకు షాక్ ఇచ్చింది.
నాలుగో రౌండ్‌లో రైబాకినా 6 6 ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను మట్టికరిపించింది. దూకుడైన ఆటతీరుతో కేవలం రెండు సెట్లలోనే ప్రత్యర్థి పని పట్టిన రైబాకినా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గంటా 9 నిమిషాల పాటు మ్యాచ్ జరగ్గా.. రైబాకినా 5 ఏస్‌లు, 5 బ్రేక్ పాయింట్లు, 26 విన్నర్లు సంధించింది. క్వార్టర్స్‌లో రైబాకినా ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలినితో తలపడనుంది. మరో మ్యాచ్‌లో మిర్రా ఆండ్రీవా వార్వరా గ్రచేవాపై నెగ్గింది.






