30-11-2024 04:18:30 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాల, కళాశాలలకు జీసీసీ ద్వారా సరఫరా చేసే కాస్మోటిక్ తో పాటు నిత్యవసర సరుకులు నాణ్యతతో కూడినవి, పరిశీలించిన తర్వాతనే సకాలంలో సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్ అధికారుల ఆదేశించారు. శనివారం ఐటిడిఏ సమావేశం మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సహకార సంస్థ సొసైటీల మేనేజర్లు అకౌంటెంట్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి కొన్ని సూచనలు ఇస్తూ, ఇటీవలే రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలో, గురుకులాలు వసతిగృహాలలో నాసిరకం ఆహార పదార్థాల వలన విద్యార్థిని, విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అందరికీ తెలిసిన విషయమేనని, విద్యార్థినీ విద్యార్థులకు అనారోగ్యపరంగా ఏ సమస్య వచ్చిన ఆహార పదార్థాల లోపం వల్ల జరిగిందని అనుకుంటారని, అందుకు జిసిసిలో పనిచేసే మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది జిసిసి గోడౌన్ నుంచి సరఫరా చేసే వస్తువులు, సరుకులు నాణ్యత లోపం లేకుండా చూసి ఇండెంట్ ప్రకారము సంబంధిత ఇన్స్టిట్యూషన్లకు సరఫరా చేసి, సంబంధిత హెచ్ఎం, వార్డెన్, ప్రిన్సిపాల్ నుండి ఎన్ఓసి రిపోర్టు తీసుకోవాలని అన్నారు.
గోడౌన్స్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యతగా లేని వస్తువులు, డేట్ అయిపోయిన సరుకులు వెంటనే వాపస్ చేయాలని, ఏ వస్తువు సరఫరా చేసిన తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి రాతపూర్వకంగా సరుకుల నాణ్యతకు సంబంధించిన వివరాలు తీసుకొని ఫైల్ చేయాలని అన్నారు. సంబంధిత హెచ్ఎం, వార్డెన్, ప్రిన్సిపాల్ లతో స్నేహ బావ సంబంధాలు ఏర్పరచుకొని వారికి కావలసిన నిత్యవసర వస్తువులు సకాలంలో అందించాలని అన్నారు. సివిల్ సప్లై ద్వారా జిసిసికి వచ్చే బియ్యం నాణ్యత పరిశీలించాలని, అలాగే సంబంధిత ఇన్స్టిట్యూషన్లకు సకాలంలో బియ్యం సరఫరా కావాలని అన్నారు. హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యం సన్న బియ్యం మాత్రమే సరఫరా కావాలని అన్నారు. అలాగే అడవి ప్రాంతాలలో నివసించే గిరిజన కుటుంబాల నుండి సేకరించే అటవీ ఫలాలు మధ్య దళారుల బారిన పడకుండా తప్పనిసరిగా జిసిసి డిర్ డిపోలకు గిరిజనులు నేరుగా తీసుకొచ్చి అమ్ముకునేలా సంబంధిత సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
జిసిసి నుండి సరఫరా చేసిన నిత్యవసర వస్తువులు నాసిరకంగా ఉన్నవని, నాణ్యత సరిగా పాటించడం లేదని హెచ్ఎం, వార్డెన్, ప్రిన్సిపాల్ నుండి గాని ఫిర్యాదులు వచ్చినచో సంబంధిత జిసిసి మేనేజర్లు, అకౌంటెంట్లను శాఖపరమైన చర్యలతో పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అంతకుముందు భద్రాచలంలోని గురుకుల పాఠశాలను గురుకులం ఆర్సిఓ నాగార్జున రావుతో కలిసి ఆయన సందర్శించి, పాఠశాలలో జిసిసి ద్వారా నాణ్యమైన సరుకులు సరఫరా అవుతున్నది లేనిది విద్యార్థినిలను అడిగి తెలుసుకుని, పాఠశాలకు కావలసిన వస్తువుల జాబితా ఇండెంట్ సకాలంలో సమర్పించి నాణ్యతతో కూడిన సరుకులు తెప్పించుకోవాలని సంబంధిత ప్రిన్సిపాల్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంజిసిసి సమ్మయ్య, జిసిసి మేనేజర్లు లక్ష్మోజి, నరసింహారావు, జయరాజ్, పాపారావు, లక్ష్మణరావు, దీప్లాల్, భూషయ్య, జిసిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.